తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు నాయకులు. ఇందులో భాగంగా పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఇంచార్జ్ లు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఇదే జోష్ కొనసాగిస్తూ లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్ కు దిశా నిర్థేశం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అన్న వార్తలు పూర్తి అవాస్తవం అని తేల్చి చెప్పారు.
డిశంబర్ చివరి వారంలో తెలంగాణలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుంన్నారు. అయితే అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఇప్పటి నుంచే దానికి అవసరమైన కసరత్తులు క్రిందిస్థాయి నుంచి ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని దానిని అందిపుచ్చుకోవాలని చెప్పారు. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు.
రేపటి నుంచి భారత్ వికసిత్ యాత్ర తెలంగాణలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని జిల్లా స్థాయి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..