ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ చిక్కుల్లో పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీలోని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-69 నందగిరి హిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ కాలనీలో 800 గజాల వరకూ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ఓపెన్ ల్యాండ్‌ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ గోడ కట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఆ పనులు చేయిస్తుండగా కొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రాంచందర్ తదితరులు గోడను కూల్చేయించారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న V.పాపయ్య ఇచ్చిన ఫిర్యాదుతో దానం సహా ఆయన వర్గీయులపై కేసు పెట్టారు. ప్రహరీ కూల్చివేతతో GHMCకి 10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను A3 గా చేర్చారు పోలీసులు. దానం నాగేందర్‌తోపాటు మరికొందరిపై ఐపీసీ, పీడీపీపీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..