
తెలంగాణే తన శ్వాస అంటూ వైఎస్‌ఆర్టీపీని స్థాపించిన వైఎస్ షర్మిల… ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు షర్మిల. పలువురు ఏపీ కాంగ్రెస్‌నేతలు, ఏఐసీసీ నాయకుల సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరిగింది. అనంతరం భర్త అనిల్‌తో కలిసి సోనియాను కూడా కలిశారు షర్మిల.
షర్మిల పార్టీ విలీనం ఊహించిందే అయినప్పటికీ… అసలు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన టాస్క్ ఏమిటన్నదే ఆసక్తి రేపుతోందిప్పుడు. ఎలాగూ.. ఏపీని ఇప్పట్లో దక్కించుకోలేం కాబట్టి… టార్గెట్ 2029గా పెట్టుకుని షర్మిలకు బరిలోకి దించుతోందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపై కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని చెబుతున్న షర్మిలకు.. అసలా పార్టీపై నమ్మకం ఎలా కలిగిందనే ఆశ్చర్యమూ కలుగుతోంది.
ఇక, షర్మిల రోల్ ఢిల్లీ స్థాయిలో ఉంటుందా? లేక ఏపీలో ఉంటుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇస్తే.. రాజకీయంగా, పార్టీ పరంగా ఆమె ముందు చాలానే సవాళ్లు ఉంటాయన్నది విశ్లేషకుల మాట. సీనియర్ నాయకుల్ని కలుపుకెళ్లడం, ఘర్‌వాపసీకి శ్రీకారం చుట్టడం… కకావికలమైన క్యాడర్‌కు భరోసా కల్పించడం.. ఇవన్నీ అంత ఈజీ టాస్క్‌లయితే కాదన్నది ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం.
రాజన్న బిడ్డగా చెప్పుకొనే షర్మిల.. రాబోయే ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపడం ఖాయంగా తెలుస్తోంది. దానికి కాంగ్రెస్ బ్రాండ్ కూడా తోడయితే భారీగా ఓట్ల చీలిక తప్పదు. ఆ ఓట్ల చీలిక ఎవరికెంత నష్టం చేస్తుందన్నదే ఉత్కంఠ రేపుతున్న విషయం. మరి, భవిష్యత్ కు ఆమె రూట్ మ్యాప్ ఎలా సిద్ధం చేసుకుంటుందనేది చూడాలి. ఇంతకీ ఆమె టార్గెట్ అధికారమా? అధికారమార్పిడా? అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..