Big News Big Debate: అసెంబ్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ డిష్యుం డిష్యుం!

|

Feb 09, 2024 | 7:03 PM

తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. అసెంబ్లీ వేదికగా విపక్ష బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌ రెడ్డి. దీనికి అదే స్థాయిలో ప్రతిపక్ష సభ్యులు రివర్స్‌ కౌంటర్‌ ఇవ్వడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. గతప్రభుత్వం చేసిన పనులు మొదలు.. నేటి ప్రభుత్వం చేపట్టిన మార్పుల దాకా.. వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌ నడిచింది.

Big News Big Debate: అసెంబ్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ డిష్యుం డిష్యుం!
Big News Big Debate
Follow us on

తెలంగాణలో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదతీర్మానంపై మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి … బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పుపై సభలో అధికారికంగా ప్రకటించారు రేవంత్‌. ట్రాన్స్‌ పోర్ట్‌ కోడ్‌ను కూడా టీఎస్‌ నుంచి టీజీ మారుస్తామన్న రేవంత్‌… గత ప్రభుత్వపు రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి అధికారిక గీతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు.

రెండు నెలల తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రేవంత్‌.. పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనను కలవడంపైనా స్పందించిన రేవంత్‌.. తెలంగాణ మొత్తానికి తాను ముఖ్యమంత్రినని చెప్పారు. ఎమ్మెల్యేలుగా ఎవరొచ్చి కలిసినా ఆహ్వానిస్తానన్నారు.

సీఎం రేవంత్‌కు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే… బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకోసమే పనిచేసిందని గుర్తు చేశారు గులాబీ సభ్యులు.

గవర్నర్‌ ప్రసంగం తర్వాత తొలిరోజే.. సభ అట్టుడికిపోవడంతో.. మున్ముందు పాలక, ప్రతిపక్షాల మధ్య వార్‌ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సభలోకి ఎంట్రీ ఇస్తే.. హీట్‌ మరింత పీక్స్‌ చేరడం ఖాయంగా అనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..