Bhongir Politics: భువనగిరి బీజేపీ ఎంపీ టికెట్‌ను బీసీకి ఇస్తారా..? రెడ్డి అభ్యర్థిని నిలబెడతారా ?

| Edited By: Balaraju Goud

Jan 05, 2024 | 4:12 PM

కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంపై ఫోకస్ పెట్టింది. భువనగిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ మళ్లీ బీసీ అభ్యర్థిని బరిలో దించుతోందా..? లేక రెడ్డికే టికెట్ ఇస్తుందా..? ఇదే ఇప్పుడ హాట్‌టాపిక్‌గా మారింది.

Bhongir Politics: భువనగిరి బీజేపీ ఎంపీ టికెట్‌ను బీసీకి ఇస్తారా..? రెడ్డి అభ్యర్థిని నిలబెడతారా ?
BJP
Follow us on

కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంపై ఫోకస్ పెట్టింది. భువనగిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ మళ్లీ బీసీ అభ్యర్థిని బరిలో దించుతోందా..? లేక రెడ్డికే టికెట్ ఇస్తుందా..? కమల తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీకి టికెట్ దక్కుతుందా..? ఎప్పటిలాగే పాత పంథాను కొనసాగిస్తూ, రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి ప్రయోగం చేస్తుందా..? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. భువనగిరి లోక్ సభ స్థానం నుంచి చాలామంది బీజేపీ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని కషాయ అధినాయకత్వం భావిస్తోంది. ఈ టికెట్‌పై బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ కోటి ఆశలు పెట్టుకున్నారు. జనవరి 12న భువనగిరి పార్లమెంటు పరిధిలోని నేతలతో లక్ష్మణ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. నల్లగొండ పార్లమెంటు బరి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి, భువనగిరి పార్లమెంటు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలో దించితే మంచిదన్న అభిప్రాయాన్ని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారట.

ఇదిలావుంటే ఇప్పటి వరకు భువనగిరి పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బూర గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బూర నర్సయ్య ఓటమి పాలయ్యారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు 70వేలకుపైగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసొస్తాయని నర్సయ్య గౌడ్‌ లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. జిల్లాలో పార్టీ విస్తరణకు పాటుపడిన శ్యాంసుందర్ కు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న శ్యాంసుందర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. గతంలో పోటీ చేసిన తనకే టికెట్ దక్కుతుందని ధీమాతో శ్యాంసుందర్ ఉన్నారు.

భువనగిరి టికెట్‌ను బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో యువ నేత సాయి చరణ్ యాదవ్ ఆశిస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడుకు చెందిన సాయి చరణ్ జాతీయ స్థాయిలో ఏబీవీపీ నాయకుడుగా పనిచేశారు. బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌లతో సాయి చరణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో అగ్ర నేతలతో తనకున్న లాబియింగ్‌తో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

భువనగిరి పార్లమెంటు పరిధిలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ నేత గంగిడి మనోహర్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ, బండి సంజయ్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో సంగ్రామ యాత్ర ఇన్‌ఛార్జిగా మనోహర్‌రెడ్డి విజయవంతమయ్యారు. పార్టీ సూచన మేరకు ఇటీవల మునుగోడు బరి నుంచి తప్పుకుని చలమల కృష్ణారెడ్డికి మద్దతుగా పోటీ నుంచి తప్పుకున్నారు. చివరి వరకు ఉన్న నేపథ్యంలో విశ్వసనీయతను పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారని మనోహర్‌రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టవదుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దించితే, రెడ్డి అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. రెడ్డి అభ్యర్థిని ప్రయోగించాలని భావిస్తే, గంగిడి మనోహర్ రెడ్డికి అవకాశం దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి బీజేపీ భువనగిరి ఎంపీ టికెట్‌ను బీసీకి ఇస్తారా..? రెడ్డి అభ్యర్థిని నిలబెడతారా ? అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…