భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ.. ఈవోపై గ్రామస్థుల దాడి.. అసలేం జరిగిందంటే..

ఏపీ, తెలంగాణ మధ్య భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరింత ముదిరింది. ఏకంగా.. ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఎస్‌.. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూముల వ్యవహారం మరోసారి కాక రేపింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది.

భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ.. ఈవోపై గ్రామస్థుల దాడి.. అసలేం జరిగిందంటే..
Bhadradri Temple Land Dispute

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 08, 2025 | 8:23 PM

ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ ఈవో రమాదేవి, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల తోపులాటలో భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. అలాగే.. ఈవో రమాదేవికి రక్షణగా నిలిచే క్రమంలో ఆలయ అటెండర్‌ వినీల్‌ సైతం ఒత్తిడి గురయ్యారు. దాంతో.. ఇరువుర్ని భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు.. ఆస్పత్రికి వెళ్లి ఈవో రమాదేవి, అటెండర్‌ వినీల్‌ను పరామర్శించారు.

ఇక.. అల్లూరి జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి సుమారు 889 ఎకరాల భూములు ఉన్నాయి. పురుషోత్తపట్నం గ్రామం.. గతంలో భద్రాచలం రూరల్‌ మండలంలో పట్టణానికి ఆనుకుని ఉండగా.. విభజన తర్వాత.. అల్లూరి జిల్లాలోని ఎటపాక మండలంలోకి వెళ్లింది. దాంతో.. అప్పటినుంచి ఈ భూముల విషయంలో రగడ కొనసాగుతోంది. రోజురోజుకీ ఆక్రమణలు పెరిగిపోవడంతో వాటిని అడ్డుకునేందుకు భద్రాచలం ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఇటీవల ఏపీ హైకోర్టు సైతం భద్రాచలం ఆలయ అధికారులకు అనుకూలంగా ఆర్డర్స్‌ ఇచ్చింది. దాంతో.. భద్రాచలం ఆలయ భూములు అప్పగించాలని పురుషోత్తపట్నం గ్రామస్తులకు, ఎటపాక మండల రెవెన్యూ అధికారులను కోరారు. హైకోర్టు ఆర్డర్స్‌ నేపథ్యంలో భద్రాచలం ఆలయ అధికారులు పురుషోత్తపట్నం వెళ్లగా.. గ్రామస్తులు, అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది.

మరోవైపు… తరచూ వివాదాలు ఏర్పడుతుండడంతో పురుషోత్తపట్నంలోని భద్రాచలం ఆలయ భూములపై తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. విభజన సమయంలో ఏపీలో విలీనమైన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపితేనే వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే.. గత నెలలో నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా లేఖ అందజేశారు. ఏపీలో విలీనమైన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని అమిత్‌షాకి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..