
పదేళ్ల క్రితం తప్పిపోయిన ఒక మహిళా సడెన్‌గా ప్రత్యక్షమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారానికి చెందిన ఒక మహిళ 10 ఏళ్ల క్రితం మతిస్థిమితం సరిగా లేక అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరలో ఉన్న తన తల్లి గారి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో తప్పిపోయింది, ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం 10 సంవత్సరాల నుండి వెతుకుతూనే ఉన్నారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి.. మూడు నెలల క్రితమే కర్మకాండలు కూడా నిర్వహించారు.
అయితే మహారాష్ట్రలోని నాగపూర్ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో 60 సంవత్సరాల వయసు గల మతి స్థిమితం లేని మహిళ చికిత్స అనంతరం కోలుకొని తన పేరు కోటమ్మ, తన ఊరు ఏడూళ్ల బయ్యారం అని తెలుపగా, హాస్పిటల్ సిబ్బంది ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు, అతను పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ఉంటున్న కోటమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆ మహిళను నాగపూర్ నుండి స్వగ్రామానికి తీసుకొచ్చారు.
కోటమ్మ కోసం ఎన్నో చోట్ల వెతికి చనిపోయిందని ఆశలు వదులుకున్నామని, అలాంటి తను ఒక్కసారిగా మళ్ళీ ప్రత్యక్షం అవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది, కోటమ్మకు బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆమెకు పూలు జల్లి స్వాగతం పలికారు, తమ తల్లిని ఇంటికి చేర్చిన అన్నం సేవా ఫౌండేషన్ శ్రీనివాస్ ను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు, చనిపోయింది అనుకున్న తల్లి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.