Bhadradri Kothagudem: ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాలకు మరొకరు బలి.. వద్దన్నా రుణమిచ్చి ఉసురుతీశారు..
Bhadradri Kothagudem: వద్దన్నా సరే వెంటపడి మరీ రుణమిచ్చారు. కానీ వాయిదాలు చెల్లించలేదని వేధించారు. చివరికి ఉసురు తీసేలా చేశారు.

Bhadradri Kothagudem: వద్దన్నా సరే వెంటపడి మరీ రుణమిచ్చారు. కానీ వాయిదాలు చెల్లించలేదని వేధించారు. చివరికి ఉసురు తీసేలా చేశారు. కసాయిలను మించిన రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఈ కసాయిల వేధింపుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోచోట ఎవరో ఒకరు తనవు చాలిస్తూనే ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వినాయకపురానికి చెందిన నాగరాజుకు భార్య ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకునే నాగరాజు ఓ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుని మూడు నెలల క్రితం 2 సెల్‌ఫోన్లు కొన్నాడు. నాగరాజు ఆ ఫోన్లకు సంబంధించిన EMIలు సకాలంలో చెల్లించడంతో అతడికి ఫోన్లు చేసి మరీ లక్ష రూపాయలు అప్పు ఇచ్చారు. అయితే, తీసుకున్న లోన్ అనారోగ్యానికి గురైన తన భార్య చికిత్సకు ఖర్చు చేశాడు నాగరాజు. అప్పు తీసుకున్న నాగరాజు.. టైమ్‌కి EMIలు చెల్లించలేకపోయాడు. దాంతో రికవరీ ఏజెంట్లు అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రికవరీ ఏజెంట్లు.. ఇంటికి వచ్చి నాగరాజుతో దురుసుగా ప్రవర్తించారు. నడిరోడ్డుమీద అతన్ని నిలదీసి వేధించారు. రోజు టార్చర్ ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన నాగరాజు.. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు.
నాగరాజు మృతితో ఆ కుటుంబం అనాధ అయ్యింది. ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాల వల్ల తమవాడి ప్రాణాలు కోల్పోయాడని, ఫైనాన్షియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు. ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల జాబితాలో ఇప్పుడు నాగరాజు పేరు చేరింది. ఇంతమంది చావులకు కారణం అవుతున్న ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాలకు చెక్ ఎప్పుడు పడుతుందో మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
