భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దారెటు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి.. మూడు నెలలకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేటీఆర్‌ను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసపెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లు, తెల్లం కూడా తిరిగి గులాబీ గూటికి చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కీలక ప్రకటన చేశారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఛాంబర్ లో కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను కలిశారు. దీంతో మరో ఎమ్మెల్యే గద్వాలకు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కలిసి తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తెల్లం వెంకటరావు కూడా వారిని కలవడం చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు యూ టర్న్ తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెల్లం వెంకటరావు కూడా చేరతారని గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడే తెల్లం వెంకటరావు. అసెంబ్లీ ఎన్నికల ముందు భద్రాచలం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య ఉండటంతో సిట్టింగ్ ను కాదని టికెట్ ఇవ్వడం వీలుకాదని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పడంతో ఆయన అంతకుముందే.. బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపి, టికెట్ హామీతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు ఉంటే, బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కావడం విశేషం.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీ మారానని ఆయన తెలిపారు. ఇపుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లి కలవడం.. ఆయనతో మంతనాలు జరపడానికి సంబంధించిన పోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మార్పును తీవ్రంగా ఖండించారు వెంకటరావు.
ఈ నేపథ్యంలోనే వెంకటరావు ఇటా.. అటా అంటూ పెద్ద చర్చకే దారి తీసింది. తెల్లం వెంకటరావు ఎక్కడకీ వెళ్లడు పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ నేతలను కలసి ఉంటాడు. మా దగ్గరకి వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది కలగకుండా ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. మా దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయి. ఎవరు ఎక్కడికి పోరని ఆయన స్పష్టం చేశారు. అటు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సైతం తప్పుడు ప్రచారం అంటూ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు అల్ప సంతోషులు ఉన్నారని, ఫోటో తీసి పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ మంత్రుల చాంబర్లకు వచ్చి కలుస్తున్నారు. వారంతా పార్టీ మారేవారేనా. అంటూ ప్రశ్నించారు. పార్టీ మారే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్ తోనే నా ప్రయాణం. అని వెంకటరావు తేల్చి చెప్పారు. అధికార పార్టీ లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, భద్రాచలంలో అనేక హామీలు అమలు కావాలంటే ప్రభుత్వం సహకారం తప్పని సరి.. అందుకే కాంగ్రెస్ లో చేరి నిధులు సాధించి పనులు ప్రారంభించారు. పార్టీ మారే ప్రసక్తే ఉండదని తెల్లం వెంకటరావు అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మీట్.. సంచలనంగా మారి చర్చకు దారి తీసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…