
క్రైమ్‌కు కేర్ అఫ్ అడ్రస్‌గా మారిన ఆ రహదారి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆ బైపాస్ రోడ్డుపై బరితెగిస్తున్న దుండగులు టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తరించిన ఆ బైపాస్ రోడ్డుపై పోలీసుల నిఘా కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యువ డాక్టర్‌పై జరిగిన హత్యాయత్నంతో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాత్రి వేళ ఆ బైపాస్ రోడ్డు వైపు వెళ్లాలంటేనే ప్రజలు అమ్మో.. అనే పరిస్థితి ఏర్పడింది.. ఇంతకీ బట్టుపల్లి బైపాస్‌పై ఏం జరుగుతోంది. ఎందుకంత భయం..?
గురువారం రాత్రి బట్టుపల్లి-ఉర్సుగుట్ట మధ్య బైపాస్ రోడ్డులో యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన వరంగల్ నగరంలో సంచలనం సృష్టించింది. డాక్టర్ సుమంత్ రెడ్డి కారును బైక్‌తో వెంబడించిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చేందుకు స్కెచ్ వేశారు. అతని కారును ఓవర్‌టేక్ చేసి కారుకు అడ్డంగా బైక్ నిలిపారు. అతన్ని కారులో నుండి కిందకు దింపి విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతో దాడి చేసి పారిపోయారు.
తల పగిలి తీవ్ర రక్తస్రావమై రక్తం మడుగులో పడి ఉన్న డాక్టర్‌ను అదే మార్గంలో వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు.. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో బట్టుపల్లి బైపాస్ రోడ్డు మళ్లీ తీవ్ర చర్చగా మారింది. ఈ బైపాస్ రోడ్‌లో ఎలాంటి నిఘా లేకపోవడం.. పోలీసుల పెట్రోలింగ్ కరువ్వవడంతో ఆకతాయిలు, నేరస్థులకు ఈ బైపాస్ రోడ్డు క్రైమ్ స్పాట్ గా మారింది. గతంలో రాత్రివేళ లవర్స్ వెళ్లే సమయంలో.. లేదంటే కారులో ఒంటరిగా వెళ్లే వారిని కూడా ఆపి భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు తెగబడ్డారు దుండగులు. ముఖ్యంగా లారీ డ్రైవర్లను ఆపి భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద దారిదోపీడీ చేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు స్థానికులు. బట్టుపల్లి బైపాస్ లో వెళ్లాలంటే లారీ డ్రైవర్లు కొన్ని సందర్భాలలో వణికిపోతుంటారు. తాజాగా మరో ఘటన జరగడంతో మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
అయితే బట్టుపల్లి బైపాస్ పై పోలీస్ స్టేషన్ గట్టు పంచాయతీతో ఆ రహదారి క్రైమ్ కు కేర్ అఫ్ అడ్రస్‌గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 7.4 కిలోమీటర్ల దూరంతో ఉన్న ఈ బైపాస్ రోడ్ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. రోడ్డుకు అవతల ఒక పోలీస్ స్టేషన్ అయితే ఇవతల వైపు మరో పోలీస్ స్టేషన్. దీంతో ఆ మూడు పోలీస్ స్టేషన్లు ఈ రహదారిని నిర్లక్ష్యంగా వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, సుబేదారి, మడికొండ ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ బైపాస్ రోడ్ విస్తరించింది. మూడు పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది ఎవరికి వాళ్లు.. వాళ్ళే చూసుకుంటారులే అన్నట్లుగా ఈ బైపాస్ రోడ్ ను వదిలేశారంటున్నారు స్థానికులు. దీంతో క్రైమ్ కు కేర్ అఫ్ అడ్రస్‌గా మారింది. మందుబాబులు, ఆకతాయిలు కూడా రోడ్లపై మద్యం సేవిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ రహదారిపై రాత్రివేళ ఒంటరిగా వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టె పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి బట్టుపల్లి బైపాస్ రోడ్ లో నిఘా పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని ఓరుగల్లు ప్రజల కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..