Basara Student Deepika’s Father: తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని దీపిక. ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మంగళవారం రాత్రి ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని హుటాహుటిన నిర్మల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సబ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఏరియా ఆస్పత్రికి చేరుకున్న వైద్యులు దీపిక తండ్రి వీరన్నకు పరీక్షలు చేశారు. ఈ మేరకు నిర్మల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ ‘దీపిక తండ్రి వీరన్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుంది. కూతురు మృతుని తట్టుకోలేక ఆందోళనకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారు. కార్డియాలజీ టెస్ట్ లు నిర్వహించాం.. గుండె పోటు రాలేదు. బీపీ లో కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు.. ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. డాక్టర్లు సమయానికి వచ్చి వైద్యం అందించారు’ అని అన్నారు.
ఈ క్రమంలోనే దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిందని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించామని, పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నిర్మల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవెందర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.