కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల కంటే అధిక మెజారిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్‌లో ఇప్పుడే రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం తీసుకవచ్చే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎంపీ ఎన్నికల నాటికి గ్రౌండ్ లెవల్‌లో పటిష్ట పర్చుకోవాలన్న లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు. లోకసభ పరిధిలో కేంద్రం నుంచి మంజూరు చేయించిన నిధుల వివరాలను కూడా ప్రజలకు చేరవేయాలని భావిస్తున్నారు. తాజాగా ఏడు సెంగ్మెంట్లలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు కార్యక్షేత్రంలోకి దిగాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికల రణరంగలోకి దూకిన సంజయ్ బూత్ లెవల్లో పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న లోక్ సభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం జరగాలని సంకల్పించిన ఆయన ఆ దిశగా క్యాడర్‌ను పురమాయిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు కేంద్రం ద్వారా ఇప్పించిన నిధులకు సంబంధించిన వివరాలను కూడా పార్టీ శ్రేణులకు ఇచ్చి తాము చేసిన అభివృద్ది గురించి ముందస్తుగానే వివరించాలని సంజయ్ సూచించారు. గ్రామ గ్రామాన కూడా అభివృద్ది పనులకు సంబంధించిన చర్చ జరిగే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
శనివారం ఏడు సెగ్మెంట్లలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల చివరి వారంలో 20 వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. బండి సంజయ్ పలు అంశాలను వారికి వివరించారు. జాతీయ భావమే కాదు కేంద్రం ద్వారా నిధులు ఇప్పించడంలోనూ ముందు వరసలో నిలిచిన విషయాన్ని ప్రజలకు చేరవేసినట్టయితే సునాయసమైన విజాయాన్ని మరో సారి అందుకోవచ్చని బండి సంజయ్ అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ముందస్తుగా పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ప్రజల్లోకి ముందుగానే చొచ్చుకుని వెళ్తే.. ప్రత్యర్థి పార్టీలు వెనకపబడిపోతాయమని ఎన్నికల నాటికి తనకు లాభిస్తుందని భావించిన సంజయ్ ఇప్పుడే కార్యరంగంలోకి దూకారని తెలుస్తోంది.
గతంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం అయ్యేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెలఖారున లోకసభ పరిధిలోని పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏడు సెగ్మెంట్ల పరిధిలోని పార్టీ క్యాడర్‌ను ముందుగానే సమాయత్తం చేసి సానుకూల ఫలితాలు రాబట్టేందుకు కదనంరంగంలోకి దూకారు. ఇక ఈసారి అధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..