
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. వేలాది కోతులు ఇక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. వానర సేనల స్వైర విహారంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. కోతుల బెడద వల్ల స్కూళ్లు, ఆస్పత్రుల్లో కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వాటి అల్లరి చేష్టలకు జనం బేజారైపోతున్నారు.. ఈ క్రమంలోని వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఓ చక్కటి ఆలోచన చేశారు. కోతుల బెడద నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కాపాడేందుకు కొండముచ్చును కొని తెచ్చారు.
వర్ధన్నపేటలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌కు ప్రస్తుతం ఓ కొండముచ్చు పహారా కాస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిపై కోతులు పలుమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజ నరేందర్ రెడ్డి.. 30,000 వెచ్చించి ఏపీ నుండి ఓ కొండముచ్చును ఆసుపత్రి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం లభించింది. ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచనకు రోగులు, వారి బంధువులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.