
ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్‌కు చెందిన అజిత్ హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఆరు నెలలుగా ఏటీఎంలకు నగదు తరలించే వాహనాన్ని నడిపే బాధ్యత అతనిదే. ఈ పనిలో భాగంగా ప్రతిరోజూ భారీ మొత్తంలో డబ్బు అతని కళ్ల ముందే తిరుగుతుండేది. అయితే సంస్థ నుంచి మూడు నెలలుగా జీతం రాకపోవడం అతనిలో అసంతృప్తిని పెంచింది. అదే సమయంలో విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక కూడా పెరిగింది. దీంతో కళ్ల ముందు కనిపిస్తున్న ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలనే ఆశోచన అతని మైండ్‌లో మెదిలింది. ఈ క్రమంలోనే ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని అజిత్ ప్లాన్ చేశాడు.
ఫిబ్రవరి 12న గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లి ప్రాంతంలోని ఒక ఏటీఎంకు నగదు డిపాజిట్ చేసేందుకు బృందం వెళ్లింది. సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన సమయంలో వాహనం బయటే నిలిపి ఉంచారు. డ్రైవర్‌గా ఉన్న అజిత్ మాత్రం వాహనంలోనే ఉంటాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న అజిల్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఒక చౌరస్తా వద్ద వాహనాన్ని వదిలేసి, అందులోని నగదు ఉన్న ట్రంక్ బాక్స్‌ను తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ ప్రాంతానికి చేరుకుని అక్కడే వాహనాన్ని వదిలేశాడు. రాష్ట్రం దాటిపోచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు.
అయితే పెట్టెలో ఏముందని బస్సు డ్రైవర్ ప్రశ్నించడంతో అనుమానం వస్తుందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి ఆర్సీపురం ప్రాంతంలోని ఒక లాడ్జిలో గది తీసుకుని బ్లేడ్‌తో ట్రంక్ బాక్స్‌ను కోసి తెరిచాడు. అందులో ఉన్న రూ.56 లక్షల నగదును బ్యాగులో వేసుకుని మరుసటి రోజు బళ్లారి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం బెంగళూరు, పుణే, ముంబై, సోలాపూర్ వంటి నగరాలకు కొనసాగింది. పలుచోట్ల క్యాబ్‌లలో తిరుగుతూ స్టార్ హోటళ్లలో బస చేశాడు. పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకున్నాడు. ఇంతవరకు కలలో కూడా అనుకోని విలాసవంతమైన జీవితం ఒక్కసారిగా దొరకడంతో డబ్బును నీళ్లలా ఖర్చు చేశాడు. రోజుకు సగటున రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కేవలం 11 రోజుల్లోనే రూ.22 లక్షలను ఖర్చు చేశాడు.
ఇక అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. ఈ సమయంలో అజిత్ విశాఖపట్నంలో ఉన్న తన ప్రేయసితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కాల్స్ ఆధారంగా అతని కదలికలపై నిఘా పెట్టారు. ఇదే సమయంలో అనంతపురంలో ఉన్న తన బావకు ఫోన్ చేసి మంచి కారు కొనాలని, డబ్బులు తానే ఇస్తానని చెప్పాడు. కలిసి టూర్‌లకు వెళ్లాలని కూడా చెప్పాడు. కొంతకాలం తిరిగిన తర్వాత అజిత్ అనంతపురంలోని తన సోదరి ఇంటికి వెళ్లాడు.
అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతానికి వచ్చిన సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు జీతం సమయానికి చెల్లించకపోవడం, అలాగే సిబ్బంది నియామకాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. అందుకే ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సంస్థలు సిబ్బంది నియామకాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.