వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్‌లోని లింగాపూర్‌కు చెందిన ఓ దళిత మహిళను గుర్తు తెలియని కొందరు దుండగులు అపహరించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. నవంబర్ 24న ఈ ఘటన జరిగినట్లు భావిస్తుండగా.. పోలీసులు ఆ బాధితురాలి పేరును ‘సమత’గా నామకరణం చేసి.. ఇకపై అందరూ కూడా ‘సమత’గా పిలవాలని సూచించారు. ఇకపోతే ఈ ఘటనకు కారకులైన షేక్ బాబు, షేక్ షాబొద్దిన్, షేక్ మఖ్దూంగాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కేసు సంబంధించి ఛార్జ్ షీట్‌ను వారం రోజుల్లో దాఖలు చేసి.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందేలా చూస్తామని.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. అటు బాధితురాలి ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. కాగా, దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన విధంగా.. దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడినవారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి.