Love Jihad: ఆ అధికారం ఎవరికీ లేదు.. లవ్ జిహాద్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్..

|

Dec 29, 2020 | 6:43 PM

బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తుండటంపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ స్పందించారు.

Love Jihad: ఆ అధికారం ఎవరికీ లేదు.. లవ్ జిహాద్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్..
Follow us on

Love Jihad: బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తుండటంపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని గానీ, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛని గానీ హరించే అధికారం ఏ ప్రభుత్వాలకు ఉండదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

కాగా, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేసిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలుస్తుంది. యూపీలో యోగి ఆధిత్యనాథ్ సర్కార్.. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి దానిని చట్టంగా మార్చారు. యూపీ బాటలోనే మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి.

తొలి కేసు ఆ రాష్ట్రాంలోనే..
ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి ఆమోదం లభించిన వారం రోజుల్లోనే ‘లవ్ జిహాద్’పై డియోరానియా పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. బలవంతపు మత మార్పిడి చట్టం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందిన ఒక ముస్లిం యువకుడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నమోదైన ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపడం విశేషం. 21 ఏళ్ల నిందితుడు హిందూ మతానికి చెందిన బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇస్లాం మతంలోకి మారకుంటే నిందితుడు తనను చంపేస్తానని బెదిరించాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

దోషిగా తేలితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఖాయం..
ఈ చట్టం ప్రకారం లవ్ జీహాద్ సంబంధిత కేసుల్లో ఎవరైనా దోషిగా తేలితే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు కఠినమైన శిక్ష విధిస్తారు. వివాహం కోసం అమ్మాయిని మతం మారాలని బలవంతం చేస్తే, అలాంటి వివాహం చట్టప్రకారం చెల్లదని ప్రకటించడమే కాకుండా, మతమార్పిడికి సహాయం చేసే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అబద్ధం, దురాశ, లేదా మరేదైనా మోసపూరిత మార్గం ద్వారా మతం మార్చి వివాహం చేసుకోవడం బెయిల్ లేని నేరం కిందకి వస్తుందని ఈ చట్టం పేర్కొంటుంది.

 

Also read:

Amitabh Bachchan Tweet: తెలియకుండా పోస్ట్ చేశారు.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ ట్వీట్..

Farmers protest: కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలన్న రైతులు