AP Telangana water dispute: హైదరాబాద్ జలసౌధలో ఈ రోజు ఉదయం.. 11 గంటలకు రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు బోర్డు అధికారులు. ఈ సమావేశాన్ని పూర్తిగా వాడుకుని.. ఇప్పటి వరకూ తమకూ తెలంగాణకు ఉన్న సమస్యలను పరిష్కారం వెతకాలనుకుంటోంది ఏపీ. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఇప్పికే కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో డిమాండ్ చేయాలని చూస్తోంది.
అంతేకాదు, కేంద్రం జారీ చేసిన గెజిట్ లోని అభ్యంతరాలను సైతం లేవనెత్తబోతోంది ఏపీ గవర్నమెంట్. వీటితో పాటు కృష్ణాజలాల్లోని నీటి పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టుల్లో జల విద్యుత్ కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగేలా తెలుస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని తోడేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తాము ఎన్నో లేఖలు రాశామనీ.. అయినా సరే పట్టించుకోవడం లేదనీ.. కేఆర్ఎంబీని నిలదీయాలని చూస్తోంది.
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో పాటు మరిన్ని అంశాలను ప్రస్తావించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపకపోవడం- బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం పై ప్రశ్నించాలని భావిస్తోంది. మరో వైపు బోర్డుల సమావేశంలో కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే నీటి కేటాయింపులు, వాటాలపైనా చర్చించనున్నారు.
ఇక కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలని కేంద్రం తన గెజిట్ లో కోరింది. దీంతో పాటు ఆయా బోర్డులు కూడా ఏపీకి లేఖలు రాశాయి. వీటన్నిటిపైనా ఏపీ చర్చించేలా తెలుస్తోంది. వరదనీటి వాడకం, పంపకాలపై కూడా చర్చించేలా తమ ఎజెండాగా చెబుతున్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు. దీంతో పాటు కృష్ణా- గోదావరి నదులపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కడుతున్న చిన్న తరహా ప్రాజెక్టులు. వీటి నిర్మాణం కోసం 2014 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 474 జీవోలు జారీ చేసింది. ఈ జీవోల అంశాన్ని కూడా చర్చించాలని నిర్ణయించింది ఏపీ. గోదావరి జలాలను కృష్ణాబేసిన్ కు తరలింపు అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. గెజిట్ లోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఏపీ. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాజెక్టులు కాలువలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కోరనుంది ఏపీ గవర్నమెంట్.
వెలిగొండ ప్రాజెక్టును.. గెజిట్ లో అనుమతి కలిగిన ప్రాజెక్టుగా సవరించాలని డిమాండ్ చేయనుంది ఏపీ. బ్యారేజీలు, కాలువల నిర్వహణను బోర్డు పరిధిలో ఉంటే.. ఎదురయ్యే సమస్యలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించనుంది. దిగువ రాష్ట్రంగా సహజ న్యాయ సూత్రాల ప్రకారం.. పూర్తి నీటి హక్కులుంటాయని వాదించేలా తెలుస్తోంది. కృష్ణాజలాల్లో జలవివాదాల ట్రైబ్యూనల్- 2 అవార్డు వచ్చే వరకూ.. 70- 30 నిష్పత్తిలోనే ఏపీ తెలంగాణ నీటి పంపకాలు జరపాలని కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
సరిగ్గా అదే సమయంలో నీటి వాటాల్లో 50- 50 వాటాల్లో పంపకాలు చేయాలన్నది తెలంగాణ డిమాండ్. దీనిపైనా ఏపీ తమ అభ్యంతరం వ్యక్తం చేసేలా తెలుస్తోంది. మరో వైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీంతో కేఆర్ఎంబీ అనుమతితో పాటు సాగునీటి అవసరాల కోసం తమ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించాలని కోరనుంది ఏపీ. తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు- సాగునీటి అవసరాలేవీ లేవని తేల్చి చెప్పనున్నారు ఏపీ అధికారులు.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా- గోదావరి నదులపై కడుతున్న ప్రాజెక్టులపై ఏపీ గవర్నమెంట్ గట్టిగానే పోరాడాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులను వెంటనే నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డులను కోరనుంది. తెలంగాణ తమపై చేసిన అనేక ఫిర్యాదులకు ఆధారాలతో సహా బోర్డు మీటింగులో సమాధానం ఇవ్వాలని చూస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Read also: Pawan Kalyan – MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్