మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. తమ పిల్లల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోలన వ్యక్తం చేశారు. స్థానిక నలంద అనే ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం చేసిన పనికి విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ స్కూలుకి పర్మిషన్ లేదని అధికారులు సీజ్ చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆందోళనలో పడ్డారు. అధికారులు చేసిన పనితో సుమారు 650 మంది విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. తమ పిల్లల జీవితాలకు దారి చూపండని రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.
గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ నలంద పాఠశాలను వారం రోజుల క్రితం మూసివేశారు జిల్లా విద్యాశాఖ అధికారులు. పర్మిషన్ ఒకచోట తీసుకుని స్కూల్ మరోచోట నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ స్కూల్లో చదువుతున్న 650 మంది విద్యార్ధుల చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. వారిని ఇప్పుడు వేరే స్కూల్స్‌కు పంపిద్దామంటే అడ్మిషన్లు లేవు. ఒకవేల ఏదోలా బతిమాలి చేర్పించినా.. అక్కడే చెప్పే పాఠాలు, ఆ విధానాలు అర్ధం కాక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో తమకు న్యాయం చేయాలని ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ఇలా రాస్తారోకో నిర్వహించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనతో ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. పాఠశాల యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పి తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి