మూసీ పునరుజ్జీవనకు కీలక అడుగు.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పనుల అమలుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

మూసీ పునరుజ్జీవనకు కీలక అడుగు.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!
Hyderabad Gandhi Sarovar
Image Credit source: AI representative image

Edited By:

Updated on: Jun 19, 2026 | 4:53 PM

హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పనుల అమలుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి విజన్ సాధనలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు సాంస్కృతిక, సామాజిక వనరుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది పరిసర ప్రాంతాలు పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పర్యాటక రంగానికి కూడా ఇది కొత్త ఊపునిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆధునిక సదుపాయాలు, పచ్చదనం, ప్రజా వినియోగానికి అనువైన మౌలిక వసతులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల్లో ఒకటైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లభించిన ఈ సహకారం రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్ని చేకూర్చనుంది. బాపూఘాట్‌లో గాంధీ సరోవర్ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ మహానగరానికి మరో ప్రతిష్ఠాత్మక పర్యాటక, పర్యావరణ కేంద్రం అందుబాటులోకి రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us