
దంపతుల మధ్య గొడవలకు వారి పిల్లలు బలి అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చేయని తప్పులకు ఏ పాపం తెలియని పిల్లలు బలైపోతున్నారు. ఓ తల్లి క్షణికావేశం ఆమె తోపాటు మరో ఇద్దరు బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంది. భర్త మాట వినడం లేదని పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని ఎల్కిచర్ల గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. భర్త తన మాట వినడం లేదని ముగ్గురు పిల్లలను బావిలోకి తోసి అనంతరం ఆమె దూకేసింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందగా.. కుమారుడు బావిలోని చెట్ల వేర్లను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లాడి అర్తనాదాలు విన్న గ్రామస్తులు.. బాలుడిని రక్షించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీరయ్యకు జంగమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జ్యోతి, శైలజ ఇద్దరు కూతుళ్లు, జశ్వంత్ కుమారుడు సంతానం ఉన్నారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా భార్య, భర్తల మధ్య అప్పుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇళ్లు పునర్నిర్మాణం కోసం, గొర్రెలు కొనేందుకు అప్పులు తెచ్చాడు భర్త బీరయ్య. దీనికి తోడు ఇటీవల వ్యవసాయ పొలం వద్ద బోరు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి 11) సుమారు 300 ఫీట్ల వరకు బోరు వేశారు. కానీ నీరు పడలేదు. దీంతో మరో చోట బోరు వేయాలని భావించాడు. అయితే ఈ విషయంలో భార్య ఒప్పుకోలేదు. ఇప్పటికే అప్పులు పెరిగిపోయాయని.. మరో బోరు వేయడం వద్దని కోరింది. భార్య మాట వినకుండా బీరయ్య గురువారం ఉదయం బోరు వేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న భార్య జంగమ్మ పిల్లలతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. బోరు వేయవద్దని అడ్డుకుంది. అయినప్పటికీ భర్త బీరయ్య వినలేదు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన జంగమ్మ ముగ్గురు పిల్లలతో సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని బావిలోకి తోసేసింది. అనంతరం ఆమె సైతం దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే కుమారుడు జశ్వంత్ బావిలో చెట్ల వేర్లను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి బాబాయ్ కు విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి జంగమ్మ, కూతుళ్లు జ్యోతి, శైలజల మృతదేహాలను బయటకు తీశారు. విషయం బంధువులతో పాటు గ్రామస్థులకు తెలియడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశానికి ఒకే ఇంట్లో ముగ్గురు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం వరకు జంగమ్మ, ఆమె ఇద్దరు పిల్లలు అడుతూ పాడుతూ కనిపించారని.. ఎప్పుడు కనపించినా అప్యాయంగా పలకరించే వారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..