AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫీజుల పేరుతో సర్టిఫికెట్లు ఆపడం చట్ట విరుద్ధం.. ప్రైవేట్ కాలేజీకి తెలంగాణ హైకోర్టు షాక్

Telangana High Court judgment: విద్యార్థి సమర్పించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత ఆస్తి అని కోర్టు స్పష్టం చేసింది. బాకీలు ఉన్నా.. వాటి పేరుతో సర్టిఫికెట్లు నిలిపివేయడం సరైంది కాదని పేర్కొంది. బాకీలు వసూలు చేయాలంటే చట్టబద్ధ మార్గాల్లోనే ముందుకెళ్లాలని సూచించింది.

ఫీజుల పేరుతో సర్టిఫికెట్లు ఆపడం చట్ట విరుద్ధం.. ప్రైవేట్ కాలేజీకి తెలంగాణ హైకోర్టు షాక్
High Court
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 7:23 AM

Share

ఫీజులు బాకీ ఉన్నాయనే కారణంతో విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు నిలిపివేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే పత్రాలు తిరిగి ఇవ్వాలని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి అధ్యక్షతన ఉన్న సింగిల్‌ బెంచ్‌.. ఖమ్మం జిల్లాకు చెందిన చి. మురళీధర్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ యాజమాన్యం చర్యలను కోర్టు తప్పుబట్టింది.

విద్యార్థి సమర్పించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత ఆస్తి అని కోర్టు స్పష్టం చేసింది. బాకీలు ఉన్నా.. వాటి పేరుతో సర్టిఫికెట్లు నిలిపివేయడం సరైంది కాదని పేర్కొంది. బాకీలు వసూలు చేయాలంటే చట్టబద్ధ మార్గాల్లోనే ముందుకెళ్లాలని సూచించింది. మురళీధర్‌ బీటెక్‌ (మెకానికల్‌)లో చేరిన సమయంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మెమోలు, టీసీ తదితర ఒరిజినల్‌ పత్రాలను కాలేజీకి సమర్పించాడు. అయితే 2025 సెప్టెంబర్‌ 21న కాలేజీలో జరిగిన గొడవలో సీనియర్‌ విద్యార్థులు అతనిపై, అతని స్నేహితులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత పరిణామాల నేపథ్యంలో ఒక సీనియర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ కేసులో పిటిషనర్‌పై కూడా కేసు నమోదు అయింది. దీంతో అతను కేవలం 15 రోజులు మాత్రమే క్లాసులకు హాజరై చదువు మానేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు.

తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరినా.. మిగిలిన మూడేళ్ల ఫీజులు చెల్లించాలని కాలేజీ డిమాండ్‌ చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు. ఫిబ్రవరి 4న రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపిన దరఖాస్తుకూ స్పందన రాలేదని కోర్టుకు వివరించాడు. ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు అవసరమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్లు నిలిపివేయడం పూర్తిగా అన్యాయమని తేల్చిన కోర్టు.. వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీనితో రిట్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ.. విద్యాసంస్థలు ఇలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

Follow Us