Amit Shah: విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి : అమిత్ షా

|

Sep 17, 2022 | 11:04 AM

Hyderabad Liberation Day 2022: కేంద్రం నిర్వహిస్తున్న విమోచన వేడుకల్లో పోలీసు కవాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు బెటాలియన్లకు చెందిన పోలీసుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గ్రౌండ్‌ నలుమూలలా ప్రత్యేక బలగాల విన్యాసాలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

Amit Shah: విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి : అమిత్ షా
Amit Shah
Follow us on

Telangana: తెలంగాణలో విమోచన దినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పోలీసుల కవాతులు, వీవీఐపీల రాక, కళాకారుల నృత్యాలతో విమోచన వేడుకలు నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా సాగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న విమోచన వేడుకలకు కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకంలో సంతకం చేసి సందేశాన్ని రాశారు. అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న వేడుకల్లో కళాకారులు నృత్యాలతో అలరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రదర్శనలు ఇచ్చారు. మూడు రాష్ట్రాల కళారూపకాల ప్రదర్శనతో పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాలు మార్మోగాయి. డప్పుదరువులు, ఒగ్గు కథలతో కళాకారులు హోరెత్తించారు. కేంద్రం నేతృత్వంలో కొనసాగుతున్న విమోచన వేడుకలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఆహ్వానం మేరకు మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే పరేడ్‌ గ్రౌండ్స్‌ వేడుకలకు హాజరయ్యారు. గన్‌పార్కు దగ్గర కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. తెలంగాణ సమాజానికి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ సహా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పారు. దేశమంతటికీ ఇండిపెండెన్స్ వచ్చి ఏడాది గడిచిన తర్వాత హైదరాబాద్‌ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ కృషి లేకపోతే నిజాం నుంచి విముక్తి లభించేందుకు ఇంకా చాలా సమయం పట్టేదన్నారు. నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. నిజాం, రాజాకార్ల నియంతృత్వ పోకడలకు ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ పటేల్‌ చరమగీతం పాడారని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లూ విమోచన ఉత్సవాలు జరపలేదని విమర్శించారు అమిత్‌షా. పటేల్‌ పోరాటంతోనే నిజాం తలవంచారని చెప్పారు.  కానీ  విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు జంకాయని.. ఇన్నాళ్లూ ఏ గవర్నమెంట్‌ కూడా ముందుకు రాలేదని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఈ  సంవత్సరం హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి