Ginger Garlic Paste: నకిలికి అడ్డాగా మారిన హైదరాబాద్.. అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రపై దాడి.. కుళ్లిన పదార్ధాల గుర్తింపు

|

Jul 11, 2023 | 7:16 AM

కల్తీ చేయడానికి ఏదీ అనర్హం కాదంటున్నారు కొందరు కేటుగాళ్లు.. ముఖ్యంగా హైదరాబాద్‌ లో వరుస దాడుల్లో బయటపడుతున్న భయంకర నిజాలతో.. నకిలీ పదార్థాల తయారీకి కేంద్రంగా మారుతుందా? అనిపిస్తుంది ఎవరికైనా.. చిన్న పిల్లలు తినే ఆహారం దగ్గర నుంచి.. ఆహారంలో ఉపయోగించే పదార్ధాలను కూడా కల్తీ చేస్తున్నారు. 

Ginger Garlic Paste: నకిలికి అడ్డాగా మారిన హైదరాబాద్.. అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రపై దాడి.. కుళ్లిన పదార్ధాల గుర్తింపు
Nakili Allam Paste
Follow us on

కల్తీ.. కల్తీ.. కల్తీ.. నాణ్యత అన్నది ప్యాకింగ్‌లోనే.. లోపలంతా నకిలీ. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్.. అల్లం. ఇలా నాణ్యత లేని ఆహార పదార్థాల తయారీ జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాసి రకం ఆహార పదార్థాలు తయారుచేస్తున్న కేటుగాళ్లు మన ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న నిజాలు మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్గెట్లో దొరికేవి ఏవి నకిలీవో, ఏవి అసలివో తెలుసుకోలేక జనం హైరానా పడుతున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అనేది ఎంత వాస్తవమో మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్టులో కూడా అల్లం ఉండదనేది అంతే వాస్తవం అని తాజా దాడుల్లో తేటతెల్లమైంది. రుచి, వాసన కోసం రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు తయారీదారులు. మార్కెట్లో కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లిని తీసుకొచ్చి రకరకాల రసాయనాలు కలిపి రుచిగా మారుస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా నకిలీ వస్తువులకు హైదరాబాద్ అడ్డాగా మారింది. అలాంటి అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రంపై  అత్తాపూర్ పోలీసులు దాడులు చేశారు.

44 ఏళ్ల జావేద్‌ 2 సంవత్సరాలుగా అదే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్నాడు. అల్లం బదులు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కోహినూర్ బ్రాండ్‌తో కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు జావేద్. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. టీవీ9 ప్రతినిధి అక్కడికి వెళ్లినప్పుడు మురుగువాసనతో కుళ్లిపోయిన వెల్లుల్లి బస్తాలు దర్శనమిచ్చాయి. వీటిని పేస్ట్‌గా మార్చి అందులో అల్లంకి బదులు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి మార్కెట్‌లోకి సప్లై చేస్తున్నాడు. ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు, ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి రుచి, వాసనకు మంచిగా అనిపించినా కడుపులోకి వెళ్తే మాత్రం విషంతో సమానం అంటున్నారు వైద్యులు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..