6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. దీంతో తల్లి ఒడికి చిన్నారి క్షేమంగా చేరింది..

ఆదిలాబాద్, జులై 29: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నాలుగు ఏళ్ల చిన్నారి ఆత్రం గంగామణి నిన్న సాయంత్రం కనిపించకుండా పోయింది. ఊరంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం 5 గంటలకు తలమడుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాది చేశారు చిన్నారి తల్లిదండ్రులు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారిని అదే గ్రామానికి చెందిన నైతం నాగుబాయి అనే మహిళ కిడ్నాప్ చేసినట్టు సీసీ పుటేజ్ ఆదారంగా గుర్తించారు. చిన్నారిని నిందితురాలు ఆదిలాబాద్ పట్టణానికి తీసుకువచ్చి.. బస్టాండ్ ప్రాంతంలో భారతి అనే మరో నిందితురాలికి అప్పగించి అక్కడి నుండి జారుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆరుగంటల వ్యవదిలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. మద్యం డబ్బుల కోసం చిన్నారిని నైతం నాగుబాయి అనే మహిళ కిడ్నాప్ చేసినట్టు గుర్తించి.. నాగుబాయి ని అదుపులోకి తీసుకుని విచారించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రహీం పాషా, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తలమడుగు ఎస్‌ఐ డి రాధిక, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆదిలాబాద్, తాంసి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, రహదారుల సీసీటీవీ ఫుటేజీలను సేకరించి సాంకేతిక ఆధారాలతో అన్వేషణ కొనసాగించారు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఆత్రం కప్లిబాయి తలమడుగు పోలీస్ స్టేషన్‌లో సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎలాగైనా చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు చేర్చాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, పోలీసుల నిరంతర కృషి ఫలించి గత రాత్రి 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడ నందు చిన్నారి ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ చిన్నారిని ఆమె తల్లిదండ్రులైనా ఆత్రం జంగు, ఆత్రం కప్లీ బాయి లకు అప్పగించారు.
తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి క్షేమంగా లభించడంతో చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై జిల్లా ఎస్పీతో పాటు గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీసుల తక్షణ స్పందన వల్లే తమ కుమార్తె తిరిగి దక్కిందని పేర్కొంటూ జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, పిల్లలు కనిపించకపోయినా లేదా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కిడ్నాప్ చేసిన మహిళ నిందితురాలు నైతం నాగుబాయి మరియు చట్ట వ్యతిరేకంగా తన వద్ద బాలికను ఉంచుకున్న గుమ్మడి వార్ భారతి (25) w/o సునీల్ అనే మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో ఈ మహిళ భారతిపై వ్యక్తిపై దాడి చేసిన కేసు మరియు తన కుమార్తెను రిమ్స్ నందు వదిలిపెట్టిన ఘటనలు నమోదైనట్లు తెలిపారు. బాలికను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ రహీం పాషా మరియు ఎస్ఐలు రాధిక, విష్ణువర్ధన్, సిబ్బంది లాలు, మనోజ్, శ్రీనివాస్, సాగర్, సంతోష్, మౌనిక, గంగారం, నరేష్, శివకృష్ణ, ప్రతాప్, లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
