Telangana: ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా.. నమ్మితే నట్టేట మునగడమే
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను టార్గెట్ చేసి, ఫైనాన్స్ వాయిదాలు చెల్లిస్తామంటూ నమ్మించి ట్రాక్టర్లను లీజుకు తీసుకుని, సరిహద్దులు దాటిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు స్థానిక ఏజెంట్లను అరెస్టు చేసి వారి నుంచి 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులే ఆ ముఠాకు టార్గెట్.. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులను గుర్తించి రంగంలోకి దిగుతున్నారు. ఫైనాన్స్ బకాయిలు తామే చెల్లిస్తామంటూ నమ్మిస్తున్నారు. లీజు ప్రాతిపదికన ట్రాక్టర్లు తీసుకుంటూ రైతులకు ఆశ చూపిస్తున్నారు. తీరా ట్రాక్టర్లు చేతికి చిక్కగానే రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా అమాయక రైతులను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కట్టించారు.
మహారాష్ట్రలోని అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా ఆదిలాబాద్ జిల్లాలోని ఫైనాన్స్ ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇంద్రవెల్లి, బేలా, ఉట్నూర్, తాంసి మండలాల్లో రైతులను సంప్రదించి ట్రాక్టర్లను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేల చొప్పున కమిషన్ ఆశ చూపిస్తూ స్థానిక ఏజెంట్లను కూడా తమ నెట్‌వర్క్‌లో చేర్చుకుంది.
మొత్తం 9 ట్రాక్టర్లను అక్రమంగా తరలించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మహారాష్ట్రలోని అమరావతి, చిక్లీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు యోగేష్ పాటిల్‌తో పాటు ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు స్థానిక ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అయితే ఇంకా మూడు ట్రాక్టర్ల ఆచూకీ లభించాల్సి ఉంది. రైతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సాగిస్తున్న ఈ మోసాల వెనుక మరెవరైనా ఉన్నారా? మిగిలిన ట్రాక్టర్లు ఎక్కడున్నాయి? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఫైనాన్స్ బకాయిలు చెల్లిస్తామంటూ వచ్చే అపరిచిత వ్యక్తులను నమ్మి ట్రాక్టర్లు అప్పగించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ రైతులకు సూచిస్తున్నారు. మొత్తానికి లీజు పేరుతో సాగుతున్న ఈ ట్రాక్టర్ దందాపై పోలీసుల చర్యలు ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
