
తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు.
కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు.
ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ఐఎండి (IMD) నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ముందుగానే పాఠశాలలు ప్రారంభించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయ మార్పులు అమల్లోకి వచ్చాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.