తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులను విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత ప్రవీణ్ కుమార్ ద్వారా రేణుకకు రూ. 10 లక్షలకు ఏఈ పేపర్ లీక్ అయ్యింది. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. అడ్వాన్స్ కింద రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా పేపర్లను అమ్మకానికి పెట్టింది. వీరి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ అమ్మకం బాధ్యతలు అప్పగించారు.
మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు అమ్మాడు. ముందుగా అడ్వాన్స్ కింద రూ. 25 లక్షలను పుచ్చుకున్న రాజేశ్వర్ మిగిలిన నగదును పరీక్షల అనంతరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కింద తీసుకున్న పాతిక లక్షల్లో రూ.10 లక్షలు డాక్యానాయక్‌కు రాజేశ్వర్ ఇచ్చాడు. దానిలో నుంచి మరో రూ.5 లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్‌కు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేశ్వర్ తల్లి సర్పంచ్ కావడం చేత రూ.8 లక్షలతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చాక సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని తల్లీకొడుకులు కూడబలుక్కున్నారు. సిట్ విచారణలో ఇదంతా బయటపడటంతో నిందితుల నుంచి రూ. 8.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.