ఊరు గాని ఊరు, హైదరాబాద్‌లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని ఓ అడ్రస్‌కు చేరింది. రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషి లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు. అతడిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం. ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్లకు చెందిన ఓ మహిళ భర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. భర్త చికిత్స కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. ఆ మహిళకు ముగ్గురు పిల్లలతో జీవితం గడపడం కష్టంగా మారింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సహాయాన్ని అర్థించేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి ముషిపట్ల నుంచి హైదరాబాద్ కు బస్సు ఎక్కింది. కానీ మంత్రి ఇంటి అడ్రస్ కూడా ఆమెకు తెలియదు. ఎలాగో బంజారాహిల్స్‌లోని మంత్రి కోమటిరెడ్డి ఇంటి అడ్రస్‌ను తెలుసుకుని అక్కడికి చేరింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇంతవరకు ఆమెను చూడలేదు గుర్తుపట్టలేదు. ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి దీనంగా కూర్చుంది ఆ మహిళ.
ఇంటి నుంచి బయటికి వెళ్తున్న మంత్రి.. అక్కడ కూర్చున్న ఆ మహిళను చూసి ఆరా తీశారు. ఎవరమ్మా మీరు అంటూ పలకరించారు. మంత్రి పలకరింపుతో.. భోరున ఏడుస్తూ తన కష్టాన్నంతా చెప్పింది ఆ మహిళ. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడని, అతన్ని బ్రతికించుకునేందుకు ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించానని, కానీ తన భర్త తనకు దక్కలేదని వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక పిల్లల్ని పోషించలేకపోతున్నాని విలపించింది. భర్త చికిత్స కోసం చేసిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పించాలని ఆమె మంత్రి కోమటిరెడ్డిని కోరింది.
పేదల కష్ట సుఖాల్లో పాలుపంచుకుని ఆర్థికంగా చేయూతనిచ్చే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. పిల్లలతో మాట్లాడి.. తండ్రి లేని లోటును తెలుసుకుని చలించిపోయాడు. స్వయంగా మంత్రే ఇంట్లోకి వెళ్లి చాక్లెట్లు తెచ్చి అప్యాయంగా పిల్లలకు తినిపించారు. బాగా చదువుకోవాలని ఉంది సారూ.. అన్న చిన్నారుల మాటలకు భావోద్వేగానికి గురైన మంత్రి.. ఎంత చదివితే అంత వరకు చదివిస్తానని మాటిచ్చారు. ముగ్గురు పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ తల్లి పరిస్థితిని గమనించి.. లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేశారు. సీఎం కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చూసే అధికారితో మాట్లాడి.. వైద్య ఖర్చులు మొత్తం మంజూరి చేయాలని ఆదేశించారు. తానే చెక్కును ఇంటికి పంపిస్తానని భరోసా ఇచ్చాడు మంత్రి కోమటిరెడ్డి. నేనున్నానని ఏ కష్టం వచ్చినా నా గుమ్మం తెరిచే ఉంటుందని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. మనసున్న మారాజు మా కోమటిరెడ్డి వెంకన్న అంటూ ముగ్గురు పిల్లలతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…