Telangana: ‘మందు’ మహత్యం అలాంటిది మరి.. ఏకంగా పోలీసు వాహనాన్నిచోరీ చేసిన ఘనుడు.. చివరకు ఏమైందంటే?

| Edited By: Basha Shek

May 28, 2024 | 8:25 PM

టిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి పై వాహనాల మళ్లింపు చేయాలని పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు వచ్చారు. వాహనాన్ని పక్కన నిలిపివేసి డైవర్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దొరికిందే ఛాన్స్ గా భావించిన ఓ దొంగ వాహనాన్ని మెల్లిగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు.

Telangana: మందు మహత్యం అలాంటిది మరి.. ఏకంగా పోలీసు వాహనాన్నిచోరీ చేసిన ఘనుడు.. చివరకు ఏమైందంటే?
Police Vehicle
Follow us on

పోలీసులకే సవాల్ విసిరాడు ఓ వ్యక్తి. ఖాకీల వాహనాన్ని దర్జాగా చోరీ చేసి వారిని పరుగులు పెట్టించాడు. కారణం తెలీదు కానీ తీరా ఓ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసుల వాహనాన్ని వదిలేసి… తాళం మాత్రం ఎత్తుకెళ్ళాడు. వివరాల్లోకి వెళితే… జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఈ వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి పై వాహనాల మళ్లింపు చేయాలని పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు వచ్చారు. వాహనాన్ని పక్కన నిలిపివేసి డైవర్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దొరికిందే ఛాన్స్ గా భావించిన ఓ దొంగ వాహనాన్ని మెల్లిగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. విధుల్లో బిజీగా ఉన్న పోలీసులు వాహనం మిస్సింగ్ ను గమనించలేదు. అనంతరం తేరుకున్న సదరు పోలీసులు వాహనం వైపు చూడగా కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా కంగారుపడ్డ పోలీసులు వాహనం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో వాహనం గాలింపును ముమ్మరం చేశారు. తెల్లవారుజామున అలంపూర్ చౌరస్తా సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు వెళ్లి వాహనాల రాకపోకలను పరిశీలించారు. అక్కడ సిబ్బందికి వాహనం నెంబర్ ఇచ్చి కనిపెట్టలని కోరారు.

వాహనం దొరికింది కానీ…

ఓ వైపు వాహనం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులకు మిస్సయిన పెట్రోలింగ్ వాహనం పై సమాచారం అందింది. కోదండపురం పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం ఉందని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా మళ్ళీ షాక్ అయ్యారు. వాహనం ఉంది కానీ… దాని తాళం మాత్రం లేదు. దొంగ వాహనాన్ని వదిలి తాళాన్ని మాత్రం వెంట తీసుకెళ్ళాడు. ఏది ఏమైనా వాహనం లభించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాన్ని అక్కడి నుంచి తరలించి చోరికి యత్నించిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చేపట్టినట్లు సమాచారం.

అయితే ఈ మొత్తం ఘటనకు మద్యం మత్తులో హల్ చల్ చేసిన వ్యక్తే కారణమా అని పోలీసులు భావిస్తున్నారు. అదే రోజు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఓ బైకర్ నానా యాగి చేసినట్లు సమాచారం. వాహనం మిస్సింగ్ అనంతరం బైక్ మాత్రం అక్కడే ఉండగా ఆ వ్యక్తి మాత్రం కనిపించలేదు. దీంతో ఆ బైక్ పై వచ్చిన వ్యక్తే వాహనాన్ని దొంగిలించాడ అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక మరోవైపు వాహనం మిస్సింగ్ అంశం పోలీసులను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. వాహనం పక్కకు నిలిపిన అనంతరం తాళం దానికి ఎందుకు వదిలేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

 

వీడియో.. ఇదిగో..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి