Telangana: రోడ్డు వెంబడి వెళ్తుండగా కుళ్లిన దుర్వాసన.. తీరా దగ్గరకెళ్లి చూస్తే షాక్..!

| Edited By: Balaraju Goud

Oct 11, 2024 | 10:19 AM

కొల్లాపూర్ మండలం నల్లమల అడవుల్లో చిరుత మృతి కలకలం రేపుతోంది. అమరగిరి రహదారి పక్కన గండిప్రాంతంలో ఈ చిరుత మృతి చెందినట్లు గ్రామస్థులు గుర్తించారు.

Telangana: రోడ్డు వెంబడి వెళ్తుండగా కుళ్లిన దుర్వాసన.. తీరా దగ్గరకెళ్లి చూస్తే షాక్..!
Leopard
Follow us on

నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందింది. ప్రధాన రహదారిపై చిన్నగండి ప్రాంతంలో చిరుతపులి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

కొల్లాపూర్ మండలం నల్లమల అడవుల్లో చిరుత మృతి కలకలం రేపుతోంది. అమరగిరి రహదారి పక్కన గండిప్రాంతంలో ఈ చిరుత మృతి చెందినట్లు గ్రామస్థులు గుర్తించారు. మొదట ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తుండడంతో కొంతమంది గ్రామస్థులు వెళ్లి పరిశీలించగా చిరుత మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. డీఎఫ్‌వో రోహిత్ గోపిడి, ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ ఘటనాస్థలికి చేరుకుని, చిరుత కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి.. దహనం చేశారు.

చిరుత మృతిపై కొనసాగుతున్న విచారణ

చనిపోయిన చిరుత పులి వయసు పెద్దదిగా తెలుస్తోంది. అయితే అనారోగ్యంతో మరణించిందా? లేదా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది. ఇదే అంశంపై విచారణ చేపడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. దాదాపు మూడు, నాలుగు రోజులు క్రితం చిరుత మరణించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చిరుత మృతికి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక కొల్లాపూర్ నల్లమల అడవుల్లో సుమారు ఏడు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. నిత్యం పర్యాటకులు సంచరించే అమరగిరి రోడ్డు సమీపంలో చిరుత మరణించడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.

చిరుత మృతి చెంది రోజులు గడుస్తున్న ఫారెస్ట్ అధికారులు తెలియకపోవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం గ్రామస్థులను, పర్యాటకులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. దుర్వాసన వచ్చి.. గ్రామస్థులు సమాచారం చేరవేసే వరకు సిబ్బంది ఏం చేస్తున్నారని అటవీ శాఖ ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.