చిరిగినా చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అనేది సామెత. ఓ మంచి పుస్తకం మంచి మిత్రునితో సమానమని పుస్తక ప్రియులు చెబుతుంటారు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించే అద్భుత రథ సారథులు పుస్తకాలు. అలాంటి పుస్తకాలకూ హైదరాబాద్ లో ఓ పెద్ద పండుగే ఉందండోయ్.. అది బుక్ ఫెస్టివల్. త్వరలోనే నగరంలో పుస్తకాల పండుగ సందడి చేయనుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1 వరకు పుస్తక ప్రియులను అలరించనుంది. ఈ మేరకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతిలో పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈసారి బుక్ ఎగ్జిబిషన్‌లో మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. 10లక్షల పుస్తకాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
ఈ సాహిత్య వేడుకను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌లో నిర్వహిస్తున్నారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, పుస్తకాల ఆవశ్యకతను నేటి తరాలనికి అందించడం లక్ష్యంగా బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇతర భారతీయ భాషల సాహిత్యం లభిస్తుంది. బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కథల పుస్తకాలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ కూడాలభిస్తాయి.
అంతే కాకుండా ఈ బుక్ ఫెయిర్ లో చాలా మంది పుస్తకాలను డొనేట్ చేస్తుంటారు. వాటిని గ్రామీణ గ్రంథాలయాలకు పంపిస్తారు. ఇలా డొనేట్ చేసిన పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, విఠలాచార్య లాంటి ప్రముఖుల గ్రామాల్లో గ్రంథాలయాలకు అందజేసినట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. బుక్ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8.30వరకు కొనసాగనుండగా.. శని, ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమై రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..