
రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో సుమారు 50 శాతం మార్పులు, చేర్పుల కోసం రాగా.. వీటి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. దరఖాస్తులు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరుస్తుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)ను చేపట్టింది. దీనివల్ల కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పుల, చేర్పుల కోసం కోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9,00,125 మంది కేవలం మార్పులు, చేర్పుల కోసం (ఫారం-8) దరఖాస్తులు చేసుకోవటం మరో విశేషం. ఇవన్నీ ఈ సంవత్సరం జనవరి 5 నుంచి ఇప్పటివరకు వచ్చినవే. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన సందర్భాలు లేవు.
ఇదిలా ఉండగా మార్పులు, చేర్పుల కోసం వచ్చిన 29 నియోజకవర్గాల్లో అత్యధికంగా 10 వేల నుంచి 25 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఎక్కవభాగం నియోజకవర్గాల్లో 6 నుంచి 9 వేల వరకు వచ్చాయి. కేవలం 20 నియోజకవర్గాల్లో మాత్రమే వెయ్యి నుంచి మూడు వేల లోపు అందాయి. అయితే అత్యధికంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 25,026 దరఖాస్తులు వచ్చాయి. గజ్వేల్ నుంచి 24,396, హుస్నాబాద్ నుంచి 23,277, ఖానాపూర్‌లో 21,749 దరఖాస్తులు వచ్చాయి. అలాగే మానకొండూరు నియోజకవర్గంలో అతి తక్కువగా 1,219 దరఖాస్తులు వచ్చాయి.
మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు నమోదైన నూతన ఓటర్లకు వీలైనంత త్వరగా ఫొటో గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల నమోదు కోసం శని, ఆదివారాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై శనివారం రోజున ఆయన సమీక్ష జరిపారు. అయితే ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఓటు కోసం ఈ నెల 15వ తేదీలోగా నమోదు చేసుకున్న వారికి మొదటిదశలో, ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి రెండోదశలో కార్డులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టు ద్వారా ఓటర్లకు పంపాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో చోటుకు ఓటు హక్కును మార్చుకున్న ఓటర్ల విషయంలో.. ఇంతకు ముందు ఉన్న ప్రాంతంలోని ఓటును నిబంధనల మేరకు తీసివేయాలి. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే జారీచేసినటువంటి ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ప్రభావశీలురైన వ్యక్తులను గుర్తించి, ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.