Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ తల్లి ఒడిలో బాల గణేశుడి అపురూప శిల్పం..

తల్లి చనుబాలు తాగుతున్న చిన్ని గణపయ్య.. తలపై కిరీటం లేని సహజ బాల్య రూపం.. చేతిలో ఫలంతో దర్శనమిస్తున్న జగన్మాత పార్వతీదేవి.. ఎనిమిది శతాబ్దాల నాటి ఈ అద్భుత శిల్పం గ్రామ శివారులోని చెట్టు నీడలోకి ఎలా చేరింది? ఆ పరిసరాల్లో ఏదైనా పురాతన ఆలయం ఉండేదా? చరిత్రకారులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఈ అపురూప శిల్పం పూర్తి కథ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ తల్లి ఒడిలో బాల గణేశుడి అపురూప శిల్పం..
Adilabad Ancient Ganesha Sculpture

Edited By:

Updated on: Sep 13, 2026 | 11:34 AM

చెట్టు నీడలో ఒక చిన్న రాతి పీఠం.. దానిపై సుఖాసనంలో కూర్చున్న తల్లి పార్వతీదేవి.. ఆమెపై కూర్చొని తల్లి చనుబాలు తాగుతున్న బాల గణేశుడు.. చేతిలో ఫలం పట్టుకున్న జగన్మాత.. గణనాథుడి శిరస్సుపై కిరీటం లేని సహజ బాల్య రూపం.. ఇవీ ఆదిలాబాద్‌ జిల్లా నేలలో వెలుగుచూసిన ఓ అపురూప శిల్ప విశేషాలు. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అత్యంత అరుదైన శిల్పం జిల్లా కేంద్రానికి సమీపంలో బయటపడి పురావస్తు, చరిత్ర పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చందా గ్రామ శివారులో చెరువు కట్ట పక్కన ఓ చెట్టు కింద ఉన్న పీఠంపై ఈ శిల్పాన్ని స్థానిక చరిత్ర ఉపాధ్యాయుడు రొడ్డావార్ పృథ్వీరాజ్ తొలిసారిగా గుర్తించారు. ఆయన అందించిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి క్షేత్రస్థాయిలో ఆ శిల్పాన్ని నిశితంగా పరిశీలించారు. తెలుగు నేలలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్వతీదేవి సహిత బాల గణేశుడి శిల్పం లభ్యం కావడం చరిత్రలోనే ఇదే ప్రథమమని పరిశోధకులు స్పష్టం చేశారు.

సాధారణంగా గణపతి విగ్రహాలు ఏకదంతుడు, లంబోదరుడు, చేతుల్లో ఆయుధాలు, శిరస్సున కిరీటధారిగా దర్శనమిస్తుంటాయి. అయితే ఈ శిల్పంలో మాత్రం పార్వతీదేవి ఎడమ ఊరువుపైపై కూర్చుని అమాయకంగా తల్లి చనుబాలు తాగుతున్న చిన్ని గణపయ్య రూపం అత్యంత సహజసిద్ధంగా చెక్కబడి ఉంది. తలపై ఎలాంటి కిరీటం లేకపోవడం, కేవలం మాతృత్వపు ప్రేమను, దైవాన్ని బాలరూపంలో ఆరాధించే అపురూప భావనను ఇది కళ్లకు కడుతోంది. మధ్యయుగ శిల్పకారుల అద్భుత సృజనాత్మకతకు ఇది తిరుగులేని నిదర్శనంగా నిలుస్తోంది.

శిల్పంలోని ఆకృతి, శైలి, నగిషీలను బట్టి ఇది సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు నిర్ధారించారు. ఆదిలాబాద్‌కు సమీపంలోని జైనథ్‌లో ఉన్న ప్రసిద్ధ లక్ష్మీనారాయణ ఆలయ శిల్ప శైలితో దీనికి దగ్గరి పోలికలు ఉన్నాయి. క్రీ.శ. 1104 ప్రాంతంలో మాల్వా దేశానికి చెందిన పారమార జగదేవుడి కాలం నాటి శిల్ప సంప్రదాయ లక్షణాలు ఈ విగ్రహంలో ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. దక్కన్ ప్రాంత ప్రాచీన శిల్పకళా సంపదకు ఇది మరో బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన శిల్పం అసలు గ్రామ శివారులోని చెట్టు కిందకు ఎలా చేరింది? సమీపంలో ఏదైనా పురాతన ఆలయం ఉండి కాలక్రమంలో శిథిలమైందా? లేక ఎవరైనా తెచ్చి ఇక్కడ ప్రతిష్టించారా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. శిల్పం లభ్యమైన పరిసరాల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శాస్త్రీయ సర్వే నిర్వహిస్తే మరిన్ని ప్రాచీన శిల్పాలు, శాసనాలు, చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అరుదైన శిల్పాన్ని వెంటనే సంరక్షించి, భావితరాలకు భద్రపరచాలని చరిత్ర ప్రేమికులు కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us