Rajanna Sircilla: వేటకుక్కలుగా మారిన వీధి కుక్కలు.. నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి..

| Edited By: Ram Naramaneni

Aug 01, 2024 | 1:22 PM

కుక్కలు పిక్కలు పట్టేస్తున్నాయ్.. పసివాళ్లైతే ఏకంగా పీకలు కొరికేస్తున్నాయ్‌. ప్రతిఘటించలేని వృద్దులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాయ్. తాజాగా ఊర కుక్కలు ఓ వృద్ధ మహిళను బలిగొన్నాయ్....

Rajanna Sircilla: వేటకుక్కలుగా మారిన వీధి కుక్కలు.. నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి..
Rajyalakshmi
Follow us on

వీధికుక్కలు వేటకుక్కలవుతున్నాయి. ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు టార్గెట్‌గా మళ్లీమళ్లీ పంజా విసురుతున్నాయి గ్రామ సింహాలు. ఊరు మారొచ్చు… వీధి మారొచ్చు… కానీ.. ఆ భయానక దృశ్యం మాత్రం మారదు. చిన్నగా కనిపిస్తున్న అతి పెద్ద విపత్తు ఇది.  గతంలో కుక్కలంటే రాత్రి సమయంలో గ్రామాలకు, కాలనీలకు కాపలా కాసే సైనికుల్లా ఉండేవి. ఇప్పుడవి యమ భటుల్లా మారి ఆ ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి.

తాజాగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై పిచ్చి కుక్కల దాడి చేయడంతో.. ఆమె మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సేవాలాల్ తండా గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి( 80) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితం అయ్యింది. రాజ్యలక్ష్మిని దగ్గర్లో ఉన్న ఒక గదిలో ఉంచి.. రోజూ అన్నపానియాలు అందిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి వృద్ధురాలికి భోజనం చేయించి, ఇంట్లో పడుకోబెట్టి వెళ్లారు కుటుంబ సభ్యులు.

రాత్రి నిద్రిస్తున్న సమయంలో పిచ్చి కుక్కలు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై గుంపుగా దాడి చేశాయి. మొదటగా గొంతుపై దాడి చేసి, చంపి రాజ్యలక్ష్మి శరీరంలో చేతులు, మొహం, అవయవాలు పీక్కు తిన్నాయి. ఉదయం కొడుకులు, స్థానికులు చూసే సరికి రాజ్యలక్ష్మి తన ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. దాడి చేసిన ఒక కుక్క అక్కడే ఉండటంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు దానిపై దాడి చేసి చంపేశారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుక్కల దాడిలో రాజ్యలక్ష్మి మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.