Hyderabad: కంటికి గాయం అయిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. శాశ్వతంగా ఊపిరి తీశారు..

|

Nov 23, 2024 | 1:34 PM

కంట్లో కర్ర ముక్క గుచ్చుకొని ఆరేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే.. డాక్టర్లు ఓవర్ డోస్ మత్తుమందు ఇవ్వడంతో ఆ పాప కన్నుమూసింది. ఈ ఘటన హబ్సిగూడలోని ఆనంద్‌ కంటి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

Hyderabad: కంటికి గాయం అయిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. శాశ్వతంగా ఊపిరి తీశారు..
Hanvika
Follow us on

కంట్లో కర్ర ముక్క గుచ్చుకుందని ఆసుపత్రికి తీసుకెళ్తే.. వచ్చీరాని వైద్యంతో 6 ఏళ్ల బుజ్జి తల్లి ప్రాణం తీశారు వైద్యులు. మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో ఆ పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. హబ్సిగూడలోని ఆనంద్ కంటి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ పాప చనిపోయిందని విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…  ఉమ్మడి వరంగల్ జిల్లా యుగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక దంపతులు పటాన్ చెరువు సమీపంలోని బీరంగూడలో నివాసం ఉంటున్నారు. రవి స్థానికంగా ఓ బోర్‌వెల్ ఏజెన్సీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పాప ఆడుకుంటూ ఉండగా.. ప్రమాదవశాత్తూ కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది.  గాయం అవ్వడంతో.. చందానగర్‌లోని ఆనంద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ ఏం కాదని చెప్పి… కంటి చుక్కల మందు ఇచ్చి పంపించేశారు. కాసేపటికి గాయం తీవ్రత ఎక్కువ ఉందని.. హబ్సిగూడలో ఉన్న తమ ఆసుపత్రి బ్రాంచ్‌కు తీసుకువెళ్లాలని ఫోన్ చేసి చెప్పారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడలోని ఆసుపత్రికి పాపను తీసుకెళ్లగా డాక్టర్లు ముక్కు ద్వారా మత్తుమందు ఇచ్చినట్లు సమాచారం.  ఆ తర్వాత కొద్దిసేపటికే చిన్నారి అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపలో చలనం లేకపోవడంతో.. విషయాన్ని దాచి ఆసుపత్రి యాజమాన్యం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చిన్నారిని ఎల్బీనగర్‌లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు ఆనంద్ కంటి ఆస్పత్రి సిబ్బంది. రెయిన్ బో హాస్పిటల్ ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనంద్ ఐ హాస్పిటల్ డాక్టర్లను నిలదీశారు. దీంతో… రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.  మోతాదుకు మించి ఇచ్చిన మత్తుమందు వల్ల తమ  కుమార్తె చనిపోయిందని పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా వినిపించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..