Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. గోదావరిలో దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య! సూసైడ్‌కి ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరణ

|

Sep 06, 2024 | 8:08 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదుగానీ.. ఓ కానిస్టేబుల్‌ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్న కానిస్టేబుల్.. అనంతరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు...

Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. గోదావరిలో దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య! సూసైడ్‌కి ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరణ
Constable Suicide Case
Follow us on

భద్రాచలం, సెప్టెంబర్‌ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదుగానీ.. ఓ కానిస్టేబుల్‌ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్న కానిస్టేబుల్.. అనంతరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన భద్రాచలంలో శుక్రవారం (సెప్టెంబర్‌ 6) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ రమణారెడ్డి (47) క్లూస్‌ టీం విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శుక్రవారం ఆయన భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, దాని పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో.. ఎస్‌ఐ విజయలక్ష్మి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ మధుప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టిన రమణారెడ్డి ఆచూకీ లభ్యంకాలేదు. రమణారెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అయితే కానిస్టేబుల్‌ రమణారెడ్డి ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో తనకు యాక్సిడెంట్‌ జరగడం వల్ల గత 15 రోజులుగా నిద్రపట్టడం లేదని పేర్కొన్నాడు. దీనికి తోడు ఇటీవల వచ్చిన వరదల్లో ఆయన నాన్న కట్టుకున్న ఇల్లు మునిగిపోయిందని బాధపడ్డాడు. ఈ కారణాలతో తాను జీవితాన్ని ఇంతకన్నా ముందుకు తీసుకెళ్లలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆయన ఆత్మహత్య ఘటన వెలుగులోకి రావడంతో రమణారెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రస్తుతం గోదావరి నదిలో రమణారెడ్డి మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.