
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతీయ జనతా పార్టీ మొదటి అభ్యర్థుల జాబితా విడుదలైంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే ఫస్ట్ లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి లిస్టులో బీసీలతో పాటు సీనియర్ల నేతలకు స్థానం కల్పించారు.
ముగ్గురు పార్లమెంటు సభ్యులు సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, బోథ్ నియోజకవర్గం నుంచి సోయం బాపూరావు, కోరుట్ల స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు.పార్టీ ముఖ్య నేత, సీనియర్ అయిన ఈటల రాజేందర్‌ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నుంచే కాక కేసీఆర్ పోటీకి దిగుతున్న గజ్వేల్ నుంచి కూడా బీజేపీ పోటీకి దింపనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా.. ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు నలుగురు నుంచి ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో దింపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వరుస భేటీలు.. వడపోతలు.. సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్ర ఎన్నికల కమిటీ.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. బలాలు, బ్యాగ్రౌండ్, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీ కార్డ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది బీజేపీ ఆధిష్టానం. ఎన్నికల్లో బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ తన తొలి జాబితాలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. 20 మంది బీసీలు, 12 మంది మహిళలకు చోటు కల్పించారు. 8 మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్సీలకు అవకాశమిచ్చారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి 12 స్థానాలు, వెలమలు 5 స్థానాలు, వైశ్యాలు ఒక్క స్థానం కేటాయించింది బీజేపీ అధినాయకత్వం. ఇక తొలి జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేరును మాత్రం అధిష్టానం చేర్చలేదు. వీరు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ పేర్లను తొలి జాబితాలో చేర్చలేదు. వారు పోటీ చేసే స్థానాలపై కొంత సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశమున్నట్లు సమాచారం.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided the following names for the ensuing General Elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/dnadYpuiYa
— BJP (@BJP4India) October 22, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…