సూర్యాపేట, మే 29: ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను తెలంగాణ పోలీసులు బుధవారం (మే 29) అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కంటైనర్‌లో అక్రమంతా ఎద్దులను తరలిస్తూ పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు సదరు కంటైనర్‌ను ఆపి, తనిఖీలు చేపట్టారు. పోలీసులు కంటైనర్ తలుపులు తెరచి చూడగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది. కంటైనర్‌లో ఉన్న ఎద్దులన్నీ ఊపిరాడక మృత్యువాత పడ్డాయి.
ఈ ఘటనలో దాదాపు16 ఎద్దులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది ఎద్దులు కొన ఊపిరితో ఉండగా వాటిని గోశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట నుంచి ఏపీ వైపు వెళ్తుండగా కంటైనర్ పోలీసులకు పట్టుబడింది. మృతి చెందిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
కాగా ఇటీవల కాలంలో జంతువులు, పలురకాల వణ్య ప్రాణులను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ పలువురు నేరస్తులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే రీతిలో తెలంగాణలో మూగ జీవాలను కనీసం గాలి కూడా సలపని కంటైనర్లో తరలిస్తూ వాటి ప్రాణాలను నిలువునా తీశారు. 18 ఎద్దులు మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఇలా నిత్యం అక్రమ రవాణాల చేస్తూ వేల కొద్ది మూగ జీవాల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు అక్రమార్కులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.