
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా రుచికరమైన బిర్యానిని అందించే నగరంగా హైదరాబాద్ కు మంచి పేరుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో ఎక్కువ మంది బిర్యానీని అర్డర్ చేస్తున్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందులో స్విగ్గీ ద్వారా కొన్ని లక్షల బిర్యానీలు డెలివరీ అయినట్లు ఈ సర్వేలో తేలింది. స్విగ్గీ 2023లో విడుదల చేసిన ట్రెండ్స్ ప్రకారం ఎనిమిదో సారి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఫుడ్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ డెలివరీ యాప్‌లో 40,30,827 సార్లు సెర్చ్ చేయబడిన డిష్ గా రికార్డుకెక్కింది. 2023లో స్విగ్గీ డెలివరీ చేసే ప్రతి ఆరో ఆర్డర్లో బిర్యానీ ఉందని తెలిసింది. అందులోనూ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.
ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే 72 లక్షలకు పైగా బిర్యానీలను హైదరాబాద్ వాసులు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సంస్థ తాజాగా వెల్లడించింది. ఒక వ్యక్తి ఏడాదికి సరిపడ బిర్యానీలను ఒకే సారి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇతను సంవత్సరాని 1,633 బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు నాలుగు లేదా ఐదు బిర్యానీలు కేవలం ఒకే వ్యక్తి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్విగ్గి యాప్ ద్వారా ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ప్రజలు. ఇందులో భాగంగానే చెన్నై, హైదరాబాద్ వాసులు 10వేల కంటే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. ముంబాయిలో ఒక వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏడాది పొడవునా హైదరాబాద్ చికెన్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. సెకనుకు 2.5 మంది స్విగ్గి యాప్ ద్వారా బిర్యానీ ఆర్డర్ చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో హైదరాబాద్ కు చెందిన ఒకరు రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసి వార్తల్లోకెక్కారు. అంతేకాకుండా ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు, కూపన్ల ద్వారా లక్షల రూపాయలు ఆదా చేసినట్లు తెలుస్తోంది. ఒకరు ఏడాదికి రూ. 5.58 లక్షలు ఆదా చేస్తే.. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి రూ. 3 లక్షల వరకూ ఆదా చేసినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..