
ఎంతోమంది గొప్ప మేధావులు.. విద్యావేత్తలను ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణకు తలమానికంగా నిలిచిన వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు నిత్యం వివాదాల సుడిగుండంలో విమర్శలు మూట కట్టుకుంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మారింది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఎలుకలు షేక్ చేస్తున్నాయి. విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హాస్టల్స్ బయట కుక్కలు.. గదుల్లో ఎలుకలు చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినులు ఎలుక కాటుకు గురయ్యారు. తాజా మరో ఘటనతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మూషిక సేనల ముప్పుతో ఆ విశ్వవిద్యాలయం అప్రతిష్టలు మూట కట్టుకుంటుంది.
చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీలోని హాస్టల్ సమస్యలు విద్యార్థులను అవస్థలపాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలుకల బెడదతో హాస్టల్ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్న ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను రక్కి గాయాలపాలు చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినీలు ఎలుకకాటుకు గురయ్యారు. సమ్మక్క సారక్క హాస్టల్, పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. వెంటిలేటర్ హోల్స్ నుండి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు 11 విద్యార్థినుల కాళ్ళు, చేతులు కొరికాయి. నిద్రిస్తున్న విద్యార్థినీలను రక్కి గాయపర్చాయి. ఎలుకల బెడద ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.. హాస్టల్ గదుల్లో ఎలుకలు, శునకాలతో సహవాసం చేస్తున్న విద్యార్థినులు చదువులపై ఏకాగ్రత చూపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలుకలు, పాములు, తేళ్లు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ యూనివర్సిటీ క్యాంపస్ పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తోపాటు, న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్, సమ్మక్క సారక్క హాస్టల్, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి తొమ్మిది హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ప్రతి సంవత్సరం మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఆశ్రయం పొందుతూ క్యాంపస్ లో ఉన్నత విద్యను అభ్యర్థిస్తున్నారు.
హాస్టళ్ల నిర్వహణ కోసం ప్రతియేటా ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నారు. కానీ పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది.. పాములు, తేళ్లు, ఎలుకలకు ఆవాసంగా మారింది. ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. హాస్టల్ పరిసరాల్లో చెత్తాచెదారం, ఆహారపు వ్యార్థాలు పేరుకుపోవడంతో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. హాస్టల్ గదుల్లోకి చొరబడి విద్యార్థులను రక్కి గాయపరుస్తున్నాయి. ఎలుకల బెడద నుండి తమకు విముక్తి కల్పించండి మొర్రో అని బాధిత విద్యార్థినులు కోరుతున్నారు.
కేవలం గర్ల్స్ హాస్టళ్లు మాత్రమే కాదు.. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే పరిస్థితి.. పాత భవనాల్లో పెచ్చులూడి మీద పడుతున్నాయి.. పాములు తేళ్లతో నిత్యం సహవాసం చేస్తూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నత విద్యను అభ్యసిస్తున్నమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత.. విద్యార్థులు స్వీయ నియంత్రణ చర్యలు కూడా ఇక్కడ కానరావడం లేదు. హాస్టల్ పరిసరాల్లో ఆహారపు వ్యర్ధాలు పడేస్తున్నారు.. వాటికోసం వస్తున్న ఎలుకలు విద్యార్థులను రక్కి గాయపరుస్తున్నాయి. విష పురుగుల నుండి విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలుకలు, విష పురుగులతో పడరాని పాట్లు పడుతున్న విద్యార్థులు. వారి ప్రాణాలు ఫనంగా పెట్టి ఉన్నత విద్యను అభ్యశిస్తున్నారు. ఇప్పటికైనా కే.యూ పాలకవర్గం ఎలుకలు, విష పురుగుల బెడద నుండి విద్యార్థులకు విముక్తి కల్పిస్తారని ఆశిద్దాం.. !
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..