Whatsapp Scam: వాట్సాప్‌లో వెలుగులోకి నయా స్కామ్.. ఇమేజ్ పేరుతో రూ.2 లక్షలు హాంఫట్..!
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌లో వాట్సాప్ అనేది తప్పనిసరి యాప్‌గా ఉంటుంది. వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ రంగంలో విప్లవం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉందనే చందాన ఈ వాట్సాప్ ద్వారా మోసాలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. తాజాగా వాట్సాప్ ఇమేజ్ స్కామ్ ద్వారా యూజర్ల సొమ్ము తస్కరించే స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఇటీవల కాలంలో స్కామర్లు, మోసగాళ్ళు ప్రజలను మోసం చేయడానికి వాట్సాప్‌ను ఒక వేదికగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రమాదకరమైన లింక్స్ నుంచి ఓటీపీ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు వంటి స్కామ్‌ల ద్వారా ప్రజల సొమ్మును తస్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరస్థులు వినియోగదారులను దోపిడీ చేయడానికి నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటున్నారు. హిడెన్ మాల్వేర్ ఉన్న ఇమేజ్ ఫైల్ ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే కొత్త స్కామ్ ఇటీవల బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఒక వ్యక్తి తెలియని నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా పంపిన ఇమేజ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సుమారు రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ స్కామ్ స్టెగానోగ్రఫీ అనే టెక్నిక్ ద్వారా పనిచేస్తుంది.
ముఖ్యంగా ఇమేజ్ ఫైల్స్‌లో హానికరమైన కోడ్ పొందుపరుస్తారు. స్టెగానోగ్రఫీకు సంబంధించిన ఒక సాధారణ రూపాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ (ఎల్ఎస్‌బీ) స్టెగానోగ్రఫీ అంటారు. ఇది మీడియా ఫైల్స్‌లోని అతి తక్కువ ముఖ్యమైన బిట్‌లో సమాచారాన్ని దాచిపెడుతుంది. ఒక ఇమేజ్ సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులకు అనుగుణంగా మూడు బైట్ల డేటాను కలిగి ఉంటుంది. దాచిన డేటా తరచుగా నాలుగో బైట్లో పొందుపరుస్తారు. దీనిని ‘ఆల్ఫా’ ఛానల్ అని కూడా పిలుస్తారు. బాధితుడు ఆ వైరస్ సోకిన చిత్రాన్ని తెరిచిన తర్వాత ఆ మాల్వేర్ వారి పరికరంలో ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ మాల్వేర్ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్‌డులు వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరికరానికి రిమోట్ యాక్సెస్‌ను కూడా అనుమతిస్తుంది. బాధితుడు ప్రారంభంలో చిత్రాన్ని విస్మరిస్తే, స్కామర్లు ఫైల్‌ను తెరవమని ఒత్తిడి చేయడానికి కాల్‌తో ఫాలో అప్ చేయవచ్చు. ఇటీవలి జబల్పూర్ కేసులో ఒక వ్యక్తికి తెలియని నంబర్ నుంచి ఫోటో వచ్చింది. ఆ ఫొటోలోని వ్యక్తిని గుర్తించాలని వాట్సాప్ కాల్ వచ్చింది. మొదట్లో ఆ సందేశాన్ని పట్టించుకోలేదు. క్రమేపి పదే పదే కాల్స్ చేసిన తర్వాత బాధితుడు ఇమేజ్‌పై క్లిక్ చేశాడు. దీంతో అతని బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.2 లక్షలు విత్‌డ్రా అయ్యాయి.
మోసాల నుంచి రక్షణ ఇలా
- తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫొటో, వీడియో లేదా లింక్లను వాట్సాప్‌లో డౌన్లోడ్ చేయవద్దు.
- వాట్సాప్ సెట్టింగ్స్ ఆటో-డౌన్లోడ్ ఫీచర్‌ను నిలిపివేయాలి. ముఖ్యంగా తెలియని మూలాల నుంచి పెద్ద లేదా అనుమానాస్పద ఫైల్స్‌ను తెరవడం మానుకోవాలి.
- అనుమానాస్పదంగా అనిపించే కాల్స్, సందేశాలను విస్మరించాలి. కుదిరితే బ్లాక్ చేయాలి.
- ఇలాంటి మోసాల గురించి ఇతరులకు అవగాహన కల్పించి, వారు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడాలి. ఏవైనా సంఘటనలను అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నివేదించాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి