Agentic AI: ఏజెంటిక్ ఏఐ.. ఇది ఏఐకి బాబు లాంటి టెక్నాలజీ! ఎలా ఉంటుందంటే..

ఏఐ రాకతోనే ప్రపంచం మారిపోతుంది అనుకుంటుంటే ఇప్పుడు దాన్ని తలదన్నే టెక్నాజీలు వస్తున్నాయి. అలాంటిదే ఏజెంటిక్ ఏఐ కూడా.. ఇది మనం వాడే ఏఐ టూల్స్ వంటిది కాదు, అంతకు మించి. ఇది మనిషి అవసరం లేకుండా సొంతంగా అప్పజెప్పిన పనులను కంప్లీట్ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Agentic AI: ఏజెంటిక్ ఏఐ.. ఇది ఏఐకి బాబు లాంటి టెక్నాలజీ! ఎలా ఉంటుందంటే..
Agentic Ai

Updated on: Oct 02, 2025 | 4:17 PM

ఏఐలో రోజుకో కొత్త అప్ డేట్ వస్తుంది. ఇప్పటివరకూ మనం ఫోన్ లో వాడుకునే ఏఐ టూల్స్ మాత్రమే చూశాం. ఇకపై ఏఐ రోబో అవతారమెత్తుతుందట. ఇలాంటి రోబోస్ లో ఏజెంటిక్ ఏఐ అనే టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తే.. అది ఒక ఏఐ ఏజెంట్ గా పనిచేయగలదు. ఏజెంటిక్ ఏఐ అంటే ఒక ఏజెంట్ లా ఇచ్చిన పనులన్నీ సొంతంగా పూర్తి చేసే టెక్నాలజీ. అంటే ఇది రెగ్యులర్ ఏఐ టూల్స్ లాగా ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ వంటి పనులు కాదు. అంతకంటే పెద్ద పెద్ద టాస్క్ లు కూడా పూర్తి చేస్తుంది.

ఏజెంటిక్ ఏఐ అంటే..

ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ టెక్నాలజీ ప్రాంప్ట్ ఆధారంగా చిన్న చిన్న టాస్క్ లను మాత్రమే చేయగలదు. కానీ, ఏజెంటిక్ ఏఐ అలా కాదు, దీనికి ప్రాంప్ట్స్ కాదు, టాస్క్ లు ఇవ్వాలి. జస్ట్ ఒక టాస్క్ ఇస్తే.. దాన్ని పూర్తి చేయడానికి ఎలాంటి ప్రాంప్ట్స్ అవసరమవుతాయో అదే డిసైడ్ చేసుకుని పనంతా పూర్తి చేసి మనకు అందిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి ఫుల్ రిపోర్ట్ లేదా ప్లాన్ ఇవ్వమని అడిగితే.. కంపెనీ గోల్స్ ను దృష్టిలో ఉంచుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒక క్యాంపెయిన్ మోడల్ ను రెడీ చేయగలదు. అలాగే దీన్ని రోబోలో ఇంటిగ్రేట్ చేస్తే.. ఒక పర్సనల్ అసిస్టెంట్ రోబోగా మారగలదు. కంపెనీలో ఫైనాన్స్ విషయాలు, సైబర్ సెక్యూరిటీ పనులు.. ఇలా మొత్తంగా ఒక ఉద్యోగి చేసే పని మొత్తం దీనికి అప్పగించొచ్చన్న మాట.

జనరేటివ్ ఏఐ vs ఏజెంటిక్ ఏఐ

ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐను జనరేటివ్ ఏఐ అంటారు. ఇది ఏజెంటిక్ ఏఐకు భిన్నమైనది. జనరేటివ్ ఏఐ అనేది హ్యూమన్ ఇన్ పుట్ ద్వారా పనిచేస్తుంది. ఏజెంటిక్ ఏఐ అనేది అటానమస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్ లో  అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఏజెంటిక్ ఏఐ వల్ల చాలా మ్యాన్ పవర్ కూడా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, అమెజాన్ వంటి టాప్ టెక్ కంపెనీలన్నీ ఈ ఏఐను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.  త్వరలోనే ఈ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి