
ఇటీవలి పార్లమెంటరీ సమావేశంలో దేశంలోని టెలికాం సేవలపై కీలక చర్చ చోటుచేసుకుంది. ముఖ్యంగా ఉపయోగించని మొబైల్ డేటా గడువు ముగియడం, వినియోగదారులు చెల్లించిన డబ్బుకు పూర్తి ప్రయోజనం పొందలేకపోవడం వంటి అంశాలు ప్రాధాన్యం పొందాయి. ఈ సందర్భంగా ఎంపీ రాఘవ్ చద్దా డేటా రోల్‌ఓవర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రభుత్వాన్ని, టెలికాం సంస్థలను కోరారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, జియో, వీఐ వంటి ప్రముఖ సంస్థలు రోజుకు నిర్దిష్ట పరిమితి (1.5GB, 2GB, 3GB)తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు రోజులో తమ డేటా కోటాను పూర్తిగా వినియోగించకపోతే, మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత గడువు ముగుస్తోంది. దీనివల్ల వినియోగదారులు చెల్లించిన డబ్బుకు పూర్తి విలువ పొందలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వినియోగదారులు మూడు ప్రధాన మార్పులను కోరుతున్నారు. మొదటగా ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు బదిలీ చేసే ‘క్యారీ-ఫార్వర్డ్’ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు. రెండవది.. వినియోగం ఆధారంగా భవిష్యత్ రీఛార్జ్ ఖర్చులను సర్దుబాటు చేయాలని సూచిస్తున్నారు. మూడవది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో డేటాను పంచుకునే విధానాన్ని అనుమతించాలని కోరుతున్నారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే టెలికాం సేవలు మరింత వినియోగదారులకు అనుకూలంగా మారవచ్చు. అదే సమయంలో వనరుల వృథాను తగ్గించడంతో పాటు డిజిటల్ సేవల వినియోగంలో సమానత్వాన్ని పెంచే అవకాశం ఉంది. ఇప్పటివరకు టెలికాం కంపెనీలు ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా, భవిష్యత్‌లో కొత్త విధానాలు వచ్చే అవకాశాన్ని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి