
టెక్ దిగ్గజం సోనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మే 13న అధికారికంగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. జపాన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్న ఈ లాంచ్ ఈవెంట్‌లో కొత్త Xperia 1 సిరీస్ ఫోన్‌ను పరిచయం చేయనుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో నెక్ట్స్ వన్ ఈజ్ కమింగ్ అనే ట్యాగ్‌లైన్ కనిపించడం వల్ల, ఇది రాబోయే Sony Xperia 1 VIII మోడల్ అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ వినియోగదారులు కూడా ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం మే 13 రాత్రి 7:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఇది ఉదయం 11 గంటలకు జరుగుతుంది. కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్, Xperia ప్రత్యేక వెబ్‌పేజీలో ఈ లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉండనుంది.
టీజర్ ప్రకారం కొత్త Xperia ఫోన్‌లో నిలువుగా అమర్చిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. L ఆకారంలో కనిపిస్తున్న ఈ కెమెరా డిజైన్, ఇప్పటికే లీకైన రెండర్‌లతో సరిపోవడం గమనార్హం. ఫోటోగ్రఫీ ఫీచర్లపై సోనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్-టైర్ కెమెరా సామర్థ్యాలను అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే ఉండొచ్చు. అలాగే ప్రధాన 24mm కెమెరాతో పాటు అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లు కూడా ఉండనున్నాయి. సోనీకి ప్రత్యేకమైన పొడవైన డిస్‌ప్లే డిజైన్, ప్రీమియం లుక్ ఈ ఫోన్‌లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
కలర్స్ విషయానికొస్తే గార్నెట్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్, లోలైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. యూరప్ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 1,868.99 యూరోలు వరకు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో సోనీ WH-1000XM6 ప్రీమియం వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు బండిల్‌గా వచ్చే అవకాశం కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి