
ప్రమాదాలు, దాడుల్లో తలకు తగిలే గాయాలు ప్రాణాంతకంగా మారుతుంటాయి. అందుకే ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తలకు రక్షణగా హెల్మెట్ ధరించాల్సిందిగా ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ.. హెల్మెట్లు ధరించనివారికి భారీగా పెనాల్టీలు సైతం విధిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే.. ప్రమాదాల్లో తలకు గాయం తగలకుండా ఉంటే చాలు.. ప్రాణాలు దక్కినట్టే. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆలోగా మెరుగైన వైద్యం అందితే చాలా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో హెలీకాప్టర్లను ఉపయోగించి గాయపడినవారిని వేగంగా ఆస్పత్రులకు తరలిస్తూ ఉంటారు. ఇక భారతదేశం విషయానికి వస్తే.. గతంతో పోల్చితే క్షతగాత్రులను వేగంగా సమీప ఆస్పత్రులకు, ట్రామాకేర్ సెంటర్లకు తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే ఉంది. అలాగే హైవేలపై ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు కూడా జరుగుతోంది. అయినా సరే.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య సైతం ఆందోళనకరంగా ఉంది. రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. తొలి గంటలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నవారే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఒకవేళ గంట లోపు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. తలకు తగిలిన గాయాన్ని అంచనా వేయడానికి సమయం సరిపోవడం లేదు. MRI వంటి ఖరీదైన స్కానింగ్ పరికరాలు అన్నిచోట్లా అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా.. వాటి దగ్గర క్యూ ఎక్కువగా ఉంటుంది. ఈలోగా క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
తలకు తగిలే గాయాల్లో మెదడు గాయపడుతుంది. దీన్నే వైద్య పరిభాషలో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (TBI) అంటారు. ఇది తీవ్రమైన ప్రాణాంతక స్థితిగా చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాలు, లేదా జారి పడిపోవడం, క్రీడల్లో తగిలే గాయాలు, ఫ్యాక్టరీ దుర్ఘటనలు, యుద్ధం లేదా సహజ విపత్తుల వంటి పరిస్థితుల్లో బ్రెయిన్ ఇంజ్యూరీ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. TBI విషయంలో అతిపెద్ద సవాలు సరైన సమయంలో వేగంగా పరీక్షించడమే. ఎందుకంటే మొదటి కొన్ని గంటలు వ్యక్తి ప్రాణాన్ని కాపాడటంలో అత్యంత కీలకమైనవి.
నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లో CT స్కాన్, MRI వంటి యంత్రాలు మెదడు లోపలి గాయాలను గుర్తించడానికి అందుబాటులో ఉన్నాయి. కానీ, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, సరిహద్దు లేదా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సౌకర్యం చాలా తక్కువ. చాలాసార్లు రోగులు స్కాన్ కోసం గంటల తరబడి ప్రయాణించాల్సి ఉంటుంది, దీనివల్ల చికిత్సలో ఆలస్యం జరిగి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
సాధారణంగా డాక్టర్లు గ్లాస్గో కోమా స్కేల్ వంటి పద్ధతులతో గాయం తీవ్రతను అంచనా వేస్తారు. కానీ ఈ పద్ధతి పూర్తిగా నమ్మదగినది కాదు. ఇందులో డాక్టర్ అనుభవం, పరిశీలన నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో CT స్కాన్, MRI వంటి పరీక్షలు ఖరీదైనవి మాత్రమే కాకుండా, వీటికి ప్రత్యేక పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, స్థిరమైన మౌలిక సదుపాయాలు అవసరం.
CEREBO® – ఒక నిమిషంలో ఖచ్చితమైన ఫలితాలు
ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు, డాక్టర్లు కలిసి CEREBO®ని అభివృద్ధి చేశారు. ఇది చిన్న, తేలికైన, పోర్టబుల్, నాన్-ఇన్వేసివ్ (శస్త్రచికిత్స – ఇంజెక్షన్ లేని) పరికరం. ఇది నియర్-ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీతో మెషిన్ లెర్నింగ్ శక్తిని ఉపయోగించి పనిచేస్తుంది.
ఈ డివైస్ ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం 60 సెకన్లలో మెదడులో రక్తస్రావం (ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్), వాపు (ఎడెమా)ను గుర్తించగలదు. దీని ఫలితాలు కలర్-కోడెడ్ రూపంలో ఉంటాయి. ఆకుపచ్చ రంగు సురక్షితం, పసుపు రంగు హెచ్చరిక, ఎరుపు రంగు ప్రమాద సూచన. ఆరోగ్య సిబ్బంది లేదా పారామెడిక్స్‌కు సాంకేతిక జ్ఞానం లేకపోయినా సులభంగా అర్థమవుతుంది.
CEREBO®లో రేడియేషన్ వాడకం లేదు. కాబట్టి ఇది రోగికి పూర్తిగా సురక్షితం. పైగా ఇది అందుబాటు ధరలో ఉంటుంది. కాబట్టి దీనిని అంబులెన్స్‌లు, ట్రామా సెంటర్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, మొబైల్ క్లినిక్‌లు, సరిహద్దు చౌకీలు, విపత్తు సహాయ శిబిరాలు, సైనిక వైద్య యూనిట్లలో సులభంగా ఉపయోగించవచ్చు.
ఎక్కడ, ఎలా గేమ్-ఛేంజర్‌గా మారనుంది?
– రోడ్డు ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలోనే గాయాన్ని గుర్తించి తక్షణ చికిత్స ప్రారంభించడం.
– క్రీడల్లో ఆటస్థలంలోనే తలకు తగిలిన గాయం తీవ్రతను పరీక్షించడం.
– గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో స్కాన్ సెంటర్‌కు చేరుకునేలోగా ముందే పరీక్ష చేయడం.
– భూకంపం, వరదలు లేదా యుద్ధం వంటి సహజ విపత్తుల్లో గాయపడిన వారిని త్వరగా పరీక్షించడం.
– సరిహద్దు ప్రాంతాలు లేదా యుద్ధ జోన్‌లలో గాయపడిన సైనికులకు ప్రాథమిక పరీక్ష.
CEREBO®ని ICMR-MDMS, AIIMS భోపాల్, NIMHANS బెంగళూరు, బయోస్కాన్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పరికరం క్లినికల్ ట్రయల్స్, ఆచరణాత్మక పరీక్షలు, రెగ్యులేటరీ ఆమోదంలో కూడా విజయం సాధించింది. ఇప్పుడు దీనిని భారతదేశంలో మాత్రమే కాకుండా..ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ హెల్త్‌కేర్, సైనిక వ్యవస్థలలో ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.