Human Washing Machine: స్నానం చేయాలంటే బద్ధకమా? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. మనిషిని ఉతికే మెషీన్‌ వచ్చేసింది! ధర ఎంతంటే..?

జపాన్ సైన్స్ కంపెనీ మానవ వాషింగ్ మెషీన్‌ను ఆవిష్కరించింది. మనుషులకు స్నానం చేయించే ఈ యంత్రం మృదువైన నీటి జెట్‌లు, మసాజ్, సంగీతంతో కూడిన స్పా అనుభవాన్ని అందిస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ఇది, ప్రజల పని భారాన్ని తగ్గించి, విశ్రాంతిని ఇస్తుంది.

Human Washing Machine: స్నానం చేయాలంటే బద్ధకమా? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. మనిషిని ఉతికే మెషీన్‌ వచ్చేసింది! ధర ఎంతంటే..?
Human Washing Machine

Updated on: Nov 29, 2025 | 2:53 PM

మెషీన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా, వేగంగా పూర్తి అవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు బట్టలు ఉతకడం, అంట్లుతోమడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషీన్లు వచ్చేశాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషీన్‌ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషీన్‌ను ప్రారంభించింది. దీనిలో ఒక వ్యక్తి పడుకుని డోర్‌ క్లోజ్‌ చేస్తే క్లీన్‌ చేస్తుంది. మృదువైన నీటి జెట్‌లు, నురుగు, తేలికపాటి మసాజ్ చేస్తుంది. అలాగే రిలాక్స్‌ అయ్యేందుకు మ్యూజిక్‌ కూడా వినిపిస్తుంది. అలాగే హార్ట్‌ బీర్‌ రేట్‌ను కూడా డిస్‌ప్లేపై చూపిస్తుంది. దీన్ని స్నానం కంటే స్పా ట్రీట్‌మెంట్‌లా భావించవచ్చు. జపనీస్ కంపెనీ సైన్స్ తయారు చేసిన ఈ మెషీన్‌, ఇటీవల ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పోలో అందరి దృష్టిని ఆకర్షించింది.

సందర్శకులు ఈ నమూనాను ఎంతగానో ఇష్టపడ్డారు, దీనిని వాణిజ్యపరంగా అమ్ముతారా అని అడగడానికి ఒక US రిసార్ట్ కంపెనీ సైన్స్‌ను సంప్రదించింది. ఆ అభ్యర్థన ఆ కంపెనీని చివరకు యంత్రాన్ని ఉత్పత్తిలోకి తీసుకురావడానికి ప్రేరేపించింది. ఆసక్తికరంగా ఈ ఆలోచన పూర్తిగా కొత్తది కాదు. 1970 ఒసాకా ఎక్స్‌పోలో ఇలాంటి హ్యుమన్‌ వాషింగ్‌ మెషీన్‌ను ప్రదర్శించారు.

మొదటి యూనిట్‌ను ఒసాకాలోని ఒక హోటల్ కొనుగోలు చేసింది. ఇది తన అతిథులకు ప్రత్యేక సేవగా మానవ వాషింగ్ మెషీన్‌ను అందించాలని యోచిస్తోంది. జపాన్‌లోని ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్‌ అయిన యమడా డెంకి మరొక కొనుగోలుదారు, ఈ అరుదైన పరికరం వినియోగదారులను తన దుకాణాలకు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు. ప్రత్యేకతను కొనసాగించడానికి ఇది దాదాపు 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని సైన్స్ చెబుతోంది. స్థానిక నివేదికల ప్రకారం.. దీని ధర 60 మిలియన్ యెన్లు (సుమారు రూ.3.2 కోట్లు).

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి