ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుందనుకోవడం అత్యాశే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకు కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడూ విజయాలు అందించే ఇస్రోకు ఒక జర్క్. నిప్పులు చెరుగుతుండే రాకెట్లను నింగిలోకి పంపే ఇస్రోకి- ఇదొక చిన్న మరక. ఫెయిల్యూర్ స్టోరీలు చెప్పుకునే చైనాతోనూ, అమెరికాతోనూ పోల్చితే మన ఇస్రోను మనం పోల్చుకోలేం. అంతరిక్షరంగంలో 90 శాతానికిపైగా సక్సెస్ రేటు ఉండే ఇస్రోకు తాజా రాకెట్ ప్రయోగం నిరాశను మిగిల్చింది. అయితే, పాఠాలు నేర్చుకుని, తప్పులు దిద్దుకుని- ఇస్రో మరింత కసిగా పనిచేయడానికి- ఈ పరాజయం పునాది వేస్తుంది. అదేంటో చూడండి.
మేరా ఇస్రో మహాన్ అని గర్వంగా గుండెలు చరిచి చెప్పుకునే భారతీయులకు ఇది నిరాశ. ఎందుకంటే- జియో సింక్రనస్ లాంచ్ వెహికల్- GSLV F10 ప్రయోగం సక్సెస్ కాలేదు. ఒకవేళ, ఇదే సక్సెస్ అయితే, కథ మరోలా ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో భారత విజయగాథతో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. మన యువకిశోరాలు- దేశకీర్తి విశ్వవ్యాప్తం చేసినందుకు- త్రివర్ణ పతాకం మురిసిపోయింది.
రియల్‌టైమ్ ఇమేజింగ్ అందించే ఉపగ్రహం ఇది. వ్యవసాయం, అడవులు, జలాశయాలకు సంబంధించిన తగిన సూచనలు చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలపై ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఒకవేళ, ఈ ఉపగ్రహం గత ఏడాది మార్చి ఐదో తేదీన అనుకున్నట్లు రోదసీలోకి వెళ్లి.. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పనిచేస్తుంటే.. మనం చూసే ఈ వరదలను, ఈ అపార నష్టాన్ని కాస్తయిన నివారించేవాళ్లం.
కానీ ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే GSLV-F10 రాకెట్‌లో కీలకమైన బ్యాటరీ సమస్య తలెత్తింది. బ్యాటరీలోని సమస్యల వల్లే- మూడో దశలో ఇగ్నిషన్ జరగలేదు. ఒకరకంగా చెప్పాలంటే సైంటిస్టుల సమస్య తీరలేదు. మూడో దశ ఎందుకు ఫెయిలైంది? మూడోదశ కాలవ్యవధి 720 సెకన్లు ఉంటుంది. ఈ క్రయోజెనిక్ స్టేజ్ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సాలిడ్, లిక్విడ్ దశలకంటే మూడోదశలో తక్కువ ఉష్ణోగ్రతల్లో ప్రొపెల్లెంట్స్‌ను వాడారు.
మూడో స్టేజ్‌లో ఇగ్నిషన్ సరిగా జరగలేదు. సాంకేతిక సమస్యల వల్లే మూడో దశ విఫలమైంది. ఈ సమస్యలే GSLV-F10 కొంపముంచాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇస్రో కూడా ఇదే చెప్పింది. ఒకటి,రెండు దశలు బాగానే సాగినా, మూడోదశ విఫలమైంది. అందుకే ఈ మిషన్ అనుకున్నట్లు ముందుకు సాగలేదని ఇస్రో చెప్పింది.
పంద్రాగస్టు ముందు- GSLV F10 సక్సెస్ అయితే ఇదే మువ్వన్నెల జెండా పరవశించిపోయేది. సైంటిస్టులు పడిన కష్టానికి, రాత్రింబవళ్లు పడిన శ్రమకు 130 కోట్లమంది ప్రజలు జయజయధ్వానాలు చేసేవారు. కానీ అనుకున్నట్లు జరగకపోవడమే- ఒక చిన్న డిస్టర్బెన్స్.
అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు చెమటలు పట్టించే భారత్ మీద ప్రపంచానికి నమ్మకం ఉంది. భారత్ నుంచి ఉపగ్రహాలను ప్రయోగిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అన్న విశ్వాసం ఉంది. 2017 ఫిబ్రవరిలో ఏకంగా 104 ఉపగ్రహాలను PSLV-C37 నింగిలోకి పంపి.. వహ్వా అనిపించుకుంది.
ఇప్పుడు మన అవసరాల కోసమే మనం పంపే ఉపగ్రహాన్ని కక్ష్యలో నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ రాకెట్ ద్వారా ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్- EOS-03 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించారు. విజయాలే సాధించే ఇస్రోను అప్పుడప్పుడూ పరాజయాలు పలకరిస్తుంటాయి.
సైంటిస్టుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదు. ఈ దేశం యావత్తూ ఇస్రో వెంట నిలబడుతోంది. అలాగే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్- ఈ సెప్టెంబర్‌లో నింగిలోకి వెళ్లబోతోంది. అయితే ఈసారి ఈ ఉపగ్రహాన్ని PSLV రాకెట్- మోసుకుపోతుంది. అలాగే ఈ ఏడాది ఆఖరుకల్లా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్‌ను కూడా ఇస్రో రోదసిలోకి పంపిస్తోంది. ఈ అపజయం- మరెన్నో అపజయాలకు పునాది వేస్తుందని ప్రతి భారతీయుడు నమ్ముతున్నాడు.
ఇవి కూడా చదవండి: Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు..