Airtel 5G: దూసుకుపోతున్న ఎయిర్ టెల్.. హైదరాబాద్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
భారతీ ఎయిర్ టెల్ సంస్థ 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన నగరాల జాబితాను మరింత విస్తృతం చేసింది. గతంలో ప్రకటించిన కొన్ని నగరాలకు తోడు మరిన్ని కొత్త నగరాలను జోడించి, కొత్త జాబితాను విడుదల చేసింది.
5జీ.. 5జీ.. 5జీ.. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా దీని మీదే చర్చ.. ఒకపక్క స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ తమ 5జీ వేరియంట్లలో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. మరోవైపు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ సంస్థలు తమ నెట్ వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీ ఎయిర్ టెల్ సంస్థ 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన నగరాల జాబితాను మరింత విస్తృతం చేసింది. గతంలో ప్రకటించిన కొన్ని నగరాలకు తోడు మరిన్ని కొత్త నగరాలను జోడించి, కొత్త జాబితాను విడుదల చేసింది. మొత్తం 14 నగరాలు ఆ జాబితాలో ఉన్నాయి. మొదట ప్రకటించిన జాబితాలో పూణే లేదు. అయితే ఇప్పుడు పూణే ఎయిర్ పోర్టులో 5జీ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఎయిర్ టెల్ 5జీ నగరాలు ఇవే..
సిమ్లా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, పాట్నా, గువాహటి, నాగ్ పూర్, సిలిగురి, ఢిల్లీ, ముంబై, వారణాసి, లక్నో, పానిపట్ నగరాల్లో ఎయిర్ టెల్ తన 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ లో..
ఎయిర్ టెల్ సంస్థ హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. నగరం పరిధిలో ఎక్కడి నుంచైనా 5జీ సేవలను పొందడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్ లు తదితర అన్ని పబ్లిక్ ప్లేస్ లలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇది అధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతాల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ 5జీ సేవలు ప్రతి 4జీ వినియోగదారుడు వినియోగించుకోవచ్చని.. ఫోన్ మాత్రం 5జీ ఎనబుల్డ్ అయితే చాలని ఎయిర్ టెల్ చెప్పింది. ప్రస్తుతం కొన్ని ప్రత్యేక టారిఫ్ లతో ఎయిర్ టెల్ తన 5జీ సేవలను అందిస్తోంది.
పెంచుకుంటూ పోతోంది..
5జీ విస్తరణలో ఎయిర్ టెల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఒకటి రెండు రోజుల్లోనే మరికొన్ని నగరాల్లో సేవలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సి అవసరంలేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఎయిర్ టెల్ ఒక్కటే 5జీ ఎన్ఎస్ఏ(నాన్ స్టాండ్ అలోన్) ను వినియోగిస్తోంది. రిలయన్స్ జియోకి కూడా ఇది అందుబాటులో లేదు. ప్రస్తుతం జియో కూడా బిటా వెర్షన్ లనే వినియోగిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..