
లేటెస్ట్ ట్రెండీ ఐటెం స్మార్ట్ వాచ్.. ప్రతి ఒక్కరూ వీటిని తమ చేతికి కలిగి ఉండాలని భావిస్తున్నారు. వీటిలోని అత్యాధునిక ఫీచర్లు అన్ని వయసుల వారినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుందని చాలా మందికి తెలీదు. వెయిట్ లాస్ కోసం స్మార్ట్ వాచ్ లు ఎలా ఉపకరిస్తాయి? వాటిలోని ఏ ఫీచర్ల ద్వారా ఇది సాధ్యమవుతుంది? తెలుసుకుందాం రండి..
యాపిల్ వంటి బ్రాండ్ వాచ్ లలోనే కాకుండా అన్ని కంపెనీల స్మార్ట్ వాచ్ లలోనూ అత్యద్భుతమైన ఫీచర్లు ఉంటున్నాయి. తక్కువ ధరలో లభించే వాచ్ లలోనూ అన్ని రకాల హెల్త్ ఫీచర్లు ఉంటున్నాయి. ఈ వాచ్ లను ఉపయోగించి వెయిట్ లాస్ అవడానికి మీరు పాటించవలసిన పద్ధతులు, కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం..
అలారం సెట్ చేసుకోండి.. స్మార్ట్ వాచ్ లో ని ఫీచర్లలో మనకు బాగా ఉపయోగపడే మంచి ఫీచర్ ఇది. ఈ వాచ్ లోని అలారంలో ప్రతి గంటకు అలారం సెట్ చేసుకోండి. అది మోగినప్పుడు ఓ గ్లాస్ మంచి నీరు తాగండి. వెయిట్ లాస్ మంచి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది హెల్త్ నిపుణులు, డైటీషియన్లు, డాక్టర్లు ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రతి గంటకు గ్లాస్ వాటర్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. పని సమయాల్లో ఈ అలారం ద్వారా కనీసం 12 నుంచి 14 గ్లాసులు నీరు మీరు తాగుతారు.
నిద్రను సరిచూసుకోండి.. చాలా స్మార్ట్ వాచ్ లలో స్లీప్ మోనిటర్స్ ఉంటున్నాయి. అయితే నిద్రపోయే ముందు మీరు వాచ్ ను చేతికి ధరించి నిద్ర సమయాన్ని లెక్కించాలి. అందులో గాఢ నిద్ర, సాధారణ నిద్రను కూడా గణించాలి. వెయిట్ లాస్ కి మంచి ఆహారం, వ్యయామంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. రోజులో కనీసం 7 నుంచి 8 ఎనిమిది గంటలు నిద్ర మనిషికి అవసరం. దీనిలో రెండు నుంచి మూడు గంటలు గాఢ నిద్ర తప్పనిసరి.
కూర్చొని పని చేసే గంటలు.. మిమ్మల్ని రిమైండ్ చేయడానికి స్మార్ట్ వాచ్ అనేది ఓ మంచి స్నేహితుడిగా మీకు ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో అన్ని స్మార్ట్ వాచ్ లలో ఉంటున్న మరో ఫీచర్ సిట్టింగ్ మోనిటర్స్. మీరు కూర్చొని పని చేసే గంటలను ఇది లెక్కిస్తుంది. ప్రతి అరగంటకు మిమ్మల్ని పైకి లేచి నడవండని రిమైండ్ చేస్తుంది. కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాలు అటు ఇటు నడవడం వల్ల మీ శరీరంతో పాటు కళ్లు కూడా స్క్రీన్ నుంచి రిలాక్స్ అవుతాయి.
హార్ట్ రేట్.. ప్రతి స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మోనిటర్ ఉంటుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఇది మీకు బాగా ఉపకరిస్తుంది. మొదటిగా మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు హార్ట్ రేట్ ను చూసుకోవాలి. ఆ సమయంలో రక్తం శరీరం అంతా క్రమ పద్ధతిలో వెళ్తుందో లేదో తెలుస్తుంది. ఆ సమయంలో సాధారణంగా హార్ట్ రేట్ 60 నుంచి 100 బీట్స్ మధ్య ఉంటుంది. ఆ తర్వాత వాకింగ్ చేసేటప్పుడు హార్ట్ రేట్ ను చూసుకోవాలి. చాలా మంది ట్రైనర్లు చెబుతున్న దాని ప్రకారం మీరు నడిచే సమయంలో హార్ట్ రేట్ 110 బీట్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి మీరు వాకింగ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు దీనిని స్మార్ట్ వాచ్ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
అడుగులను లెక్కించండి.. చివరిగా అన్ని స్మార్ట్ వాచ్ లలో ఉండే ఫీచర్ అడుగులను లెక్కించడాన్ని బాగా వినియోగించుకోవాలి. ప్రతి రోజూ 10,000 అడుగులు నడవడం సాధ్యం కాకపోతే.. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని వాటిని అధిగమిస్తూ.. ముందుకు వెళ్లాలి. ఇది మీకు స్మార్ట్ వాచ్ ద్వారా సాధ్యం అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..