SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం.. వాటిని అరికట్టేందుకే..

దేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. అటు ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తుంది. మోసపూరిత లింకులపై క్లిక్ చేయకూడదని.. తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలో మోసాలకు ఉపయోగిస్తున్న సిమ్‌లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం.. వాటిని అరికట్టేందుకే..
SIM Cards Block

Updated on: Aug 06, 2025 | 4:50 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రకరకాల పద్ధతుల్లో కేటుగాళ్లు ప్రజల నుంచి కోట్ల రూపాయలను లూటీ చేస్తున్నారు. ఫ్రాడ్ లింకులతో పాటు డిజిటల్ అరెస్టులు, బ్లాక్‌మెయిల్స్ తో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు సుమారు 3 నుండి 4 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. వీటిని ఆన్‌లైన్ మోసాలకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సిమ్ కార్డులను జారీ చేయడానికి నియమాలను కూడా కఠినతరం చేసింది. మోసగాళ్లను గుర్తించడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నారు.

ప్రతిరోజూ 2000 నంబర్లు..

మే 2025లో విడుదల చేసిన ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ డేటా ప్రకారం.. ప్రతిరోజు ఆర్థిక మోసాలలో పాల్గొన్న 2 వేల సిమ్ కార్డులు పట్టుబడుతున్నాయి. మోసాలు, సిమ్ కార్డులను గుర్తించడానికి ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు. యూపీఐ రాకతో, లావాదేవీలు సులభతరం అయ్యాయి. కానీ మోసగాళ్ళు ప్రజల నుండి డబ్బును దోచుకోవడానికి దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే దేశంలోని అన్ని బ్యాంకులు తమ వ్యవస్థలలో ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఇండికేటర్స్ మోసాలకు పాల్పడే మొబైల్ నంబర్‌లను గుర్తించి వాటిని తక్కువ, మధ్యస్థ, అధిక ప్రమాద వర్గాల వారీగా విభజిస్తుంది.

ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్‌‌తో ఇలా

మోసపూరిత ఖాతాలపై ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్‌తో చాలా ఫాస్ట్‌గా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇండికేటర్స్‌ను ఉపయోగించి, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మోసపూరిత లావాదేవీలను నిరోధించగలవు. టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్ లో భద్రతను కూడా పెంచుతున్నాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకూడదు.

తెలియని కాల్‌లు, సందేశాలను నివారించండి.

అధికారిక యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..